సస్సెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న కర్ణాటక రాజకీయాలు

కర్ణాటకలో.... రాజకీయ హైడ్రామా మరో మలుపు తిరిగింది. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్‌ నేతలు దిగి రావడం లేదు.

కర్ణాటక రాజకీయలు సస్పెన్స్‌ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని శనివారం ప్రకటించిన నాగరాజు... ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నారు. ముంబయిలో ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలని కలిసేందుకు అక్కడికి వెళ్లిపోయారు. ఈయనతో పాటు మరో ఎమ్మెల్యే సుధాకర్‌ కూడా వారితో చేరే అవకాశం ఉంది. శనివారం కూటమి పెద్దలందరితో సుధీర్ఘంగా చర్చలు జరిపిన నాగరాజు.... కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ అనూహ్యంగా...ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో కూటమి నేతల చర్చలు వృథా అయ్యాయి.

కాంగ్రెస్-జేడీఎస్‌ సంకీర్ణం నిలుదొక్కుకోవాలన్నా, అధికారం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఏకంగా పీఠమెక్కాలన్నా మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. ఈ టైమ్‌ అత్యంత కీలకం. ఏ రోజైనా విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానన్న సీఎం కుమారస్వామి తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం అసమ్మతుల భవిష్యత్తును సుప్రీంకోర్టు నిర్ణయించనుండటంతో... ఆ రోజు జరిగే పరిణామాలు కూడా చాలా కీలకంగా మారాయి. అటు రెబెల్స్‌ను అనర్హత వేటు కూడా భయపెడుతోంది.

విశ్వాస పరీక్షకు సై అన్న సీఎం కుమారస్వామి ఓడిపోతే విషాద ప్రసంగంతో సీఎం పీఠం వీడాల్సిందే. వాస్తవానికి విశ్వాస పరీక్ష గడువు కోరినా అందుకు అనుమతి ఇచ్చేందుకు స్పీకర్‌కు 14 రోజుల సమయం ఉంటుంది. అంత వరకు ఆగకుండానే ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సభకు వివరించారు. అటు కాంగ్రెస్‌ భరోసా ఇవ్వటంతో బుధవారం తన బలమేమిటో నిరూపించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఈ 2 రోజులు సీఎం కంటే కాంగ్రెస్‌కే ఎంతో కీలకం. ఇప్పటికే బీజేపీకి ఉన్న బలాన్ని దాటేందుకు తలకు మించిన కసరత్తు చేసింది కాంగ్రెస్‌. చివరికి ఎంబీటీ నాగరాజు సైతం యూటర్న్‌ తీసుకోవడంతో... ఆ పార్టీ అంతర్మథనంలో పడింది. అయినా...ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు 107 సంఖ్యా బలంతో అంతులేని విశ్వాసం ప్రదర్శిస్తోంది బీజేపీ. అదే సమయంలో లోలోపల టెన్షన్‌ కూడా లేకపోలేదు. ఇప్పటికే ఐదుసార్లు ఆపరేషన్‌ కమల్‌ పేరిట చేతులు కాల్చుకున్న బీజేపీకిఆరో వైఫల్య సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కుమారస్వామికి ఎంత ధైర్యం లేకపోతే విశ్వాస పరీక్షకు సవాలు చేస్తారంటున్నారు. .ఇప్పటికే నగరంలో తిష్టవేసిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరరావు ఆరో అరిష్టం నుంచి గట్టెక్కేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారి భవిష్యత్తు సుప్రీం కోర్టు తేల్చుతున్నప్పటికీ... అప్పటి వరకు వారిని కాపాడుకోవడం బీజేపీకి పెద్ద సవాలే.

పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదన్న ధోరణిలో ఉంది జేడీఎస్‌. మాజీ పీఎం- జేడీఎస్‌ దళపతి దేవేగౌడ సూచనలు, మిత్రపక్షాల బలం, మిగిలిన సభ్యుల ఐక్యత, రాజీనామా చేసిన అసమ్మతులపై అనర్హత వేటు తదితర అంశాలపై లెక్కలు వేస్తూ మరో రెండు రోజుల పాటు వేచి చూడక తప్పదు.

Next Story

RELATED STORIES