డైలీ సీరియల్‌లా కొనసాగుతున్న కర్నాటక రాజకీయ సంక్షోభం

కర్నాటక రాజకీయ సంక్షోభం డైలీ సీరియల్‌లా కొనసాగుతోంది. రోజుకో మలుపు తీసుకుంటూ రాజకీయం రసవత్తరంగా మారుతోది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్‌-జేడీఎస్‌. ఇప్పటికే రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను దారికి తెచ్చే బాధ్యతలను భుజనకెత్తుకున్నారు. నిన్న రోజంతా కర్ణాటకలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. రెబల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజుతో డీకే శివకు మార్, డిప్యూటీ సీఎం పరమేశ్వర సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మరో ఎమ్మెల్యే సుధాకర్‌తో నాగరాజు భేటీ అయ్యారు. వీరిద్దరు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని ప్రకటించడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కార్‌కు ఊరట లభించినట్లైంది. ఇలానే మరికొంత మందిని దారిలోకి తెచ్చేందుకు డీకే శివకుమార్‌ అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు.

అసెంబ్లీలో బల నిరూ పణకు సై అన్న సీఎం కుమారస్వామి కూడా అసంతృప్తులను దారికి తెచ్చుందుకు రంగంలోకి దిగారు. నలుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపారు. మాజీ మంత్రి రామలింగారెడ్డి సహా మరికొందరితోనూ సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఐతే, చర్చలు-బుజ్జగింపులు ఫలించలేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవడం కుదరదని అసంతృప్త ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేశారు. దీంతో మరిన్ని వ్యూహాలను పదును పెడుతున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇప్పటికే కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు క్యాంపులోనే మకాం వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమి లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు సిద్ధరామయ్య.

బలపరీక్ష ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన బీజేపీ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా రిసార్ట్‌ రాజకీయాలకు తెర తీసింది. ఎమ్మెల్యేలనందరిని బెంగళూరు నగర శివారులోని హోటల్‌కు తరలించింది. అటు రెబల్‌ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో ఉంది కమలదళం.

ఓవైపు కర్ణాటకలో రాజకీయం పొగలు సెగలు కక్కుతుంటే మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు హ్యాపీగా టూర్లు తిరుగుతున్నారు. ముంబైలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం షిర్డీకి వెళ్లారు. షిర్డీ సాయినాధున్ని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే, మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని రెబల్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో ఆరోపించారు. ఈ ఐదుగురితో కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించిన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. మంగళవారం వరకు రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఎల్లుండి సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపై ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story