అమ్మలేదు.. నాన్న జైల్లో.. అయిదేళ్ల ఆ చిన్నారి అంతర్జాతీయ స్కూల్లో..

అమ్మలేదు.. నాన్న జైల్లో.. అయిదేళ్ల ఆ చిన్నారి అంతర్జాతీయ స్కూల్లో..

జన్మనిచ్చిన తల్లి జ్వరంతో బాధపడుతూ బిడ్డ పుట్టిన 15 రోజులకే కన్నుమూసింది. నాన్నేమో నేరం చేసి జైల్లో ఉన్నాడు. అలనా పాలనా చూసుకోవడానికి ఎవరూ లేరని తండ్రితో పాటే ఆ చిన్నారినీ జైల్లో ఉంచారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి జీవితం జైలు గోడల మధ్య మగ్గి పోవలసిందేనా.. ఈ ఆలోచన అతడిని కలచి వేసింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ అలాంగ్ ప్రతి సంవత్సరం సెంట్రల్ జైల్ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు వెళుతుంటారు. ఏం నేరం చేసి ఖైదీలు జైలు శిక్షను అనుభవిస్తున్నారు అని అడిగి తెలుసుకుంటారు. వారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటారు. వారి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకుంటారు. కుటుంబ పెద్ద జైల్లో వుంటే వారిపైనే ఆధార పడ్డ మిగతా కుటుంబీకుల పరిస్థితి ఏంటని విచారణ జరుపుతుంటారు.

అవసరమనుకుంటే వారికి సహాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ క్రమంలోని ఓ రోజు జైలుకు వెళ్లిన కలెక్టర్ సంజయ్‌కి మహిళా వార్డులో కొందరు ఖైదీల మధ్యన కూర్చుని అమాయకంగా చూస్తున్న ఐదేళ్ల చిన్నారి కనిపించింది. ఎందుకో ఆ పాపని చూడగాని అతడి మనసు కలచి వేసింది. పాప వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. పాపకు తల్లి లేదని తండ్రి జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్నారు. చిన్నారి జీవితాన్ని బాగుచేయాలని ఆక్షణమే అనుకున్నారు. పాపని దగ్గరకు తీసుకుని నిన్ను చదివిస్తాము. ఏ స్కూల్లో జాయినవుతావు అని అడిగారు. దానికి ఆ చిన్నారి పెద్ద స్కూల్లో చదువుకుంటాను అని సమాధానం చెప్పింది.

పాప అన్నట్లుగానే ఆయన బిలాస్ పూర్‌లో ఉన్న అంతర్జాతీయ స్కూళ్లకు సమాచారం అందించారు. చిన్నారికి అడ్మిషన్ కావాలి.. ఇవ్వగలరా అని. అందుకు జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్లు ముందుకు వచ్చి పాప బాధ్యత అంతా మేం తీసుకుంటాం. ఇంటర్ వరకు ఉచితంగా విద్యతో పాటు హాస్టల్ వసతి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. తాము చేయని తప్పుకి అన్యాయంగా జైల్లో ఉంటున్న పిల్లల్ని చదివించాలి లేదా వారికి తమ కాళ్ల తాము నిలబడేలా ఏదైనా వృత్తి విద్యా కోర్సులైనా నేర్పించాలి అని అంటారు సంజయ్. పాప స్కూల్లో జాయిన్ అయిన మొదటి రోజు ప్రిన్సిపల్ సాదర స్వాగతం పలికారు. కలెక్టర్ సంజయ్ ఇచ్చిన స్పూర్తితో మరికొంత మంది చిన్నారులను వివిధ స్కూళ్లలో జాయిన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి కొన్ని ఎన్‌జీవో సంస్థలు.

Tags

Read MoreRead Less
Next Story