నిలిచిపోయిన చంద్రయాన్‌-2 ప్రయోగం

చారిత్రక ఘట్టం అడుగు దూరంలో ఆగిపోయింది.. భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది.. చంద్రయాన్‌-2 ప్రయోగం నిలిచిపోయింది.. లాంచ్‌ వెహికల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 19 గంటలా 4 నిమిషాల 36 సెకెన్లపాటు కౌంట్‌ డౌన్‌ కొనసాగింది.. ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల సమయంలో సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.. దీంతో హడావిడిగా కౌంట్‌డౌన్‌ ప్రక్రియను నిలిపివేశారు. క్రయోజనిక్‌ స్టేజ్‌లో బ్యాటరీలు ఛార్జ్‌ కాకపోవడం వల్లే ప్రయోగం వాయిదా పడినట్లు సైంటిస్టులు తెలిపారు. త్వరలోనే ప్రయోగ తేదీని వెల్లడిస్తామని ఇస్రో అధికారప్రతినిధి గురుప్రసాద్‌ ప్రకటించారు.

చంద్రుని మీద నీటిజాడలను చంద్రయాన్‌-1 ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. మరింత సమాచారాన్ని సేకరించేందుకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపడుతోంది.ఈ ప్రయోగం కోసం యావత్‌ ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూసింది.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ప్రత్యక్షంగా ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటలోని షార్‌కు వచ్చారు.. ఈసారి ప్రయోగాన్ని లైవ్‌లో వీక్షించేందుకు సామాన్యుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఇస్రో అధికారులు.. దీంతో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.. అయితే, ప్రయోగం వాయిదా పడటంతో అంతా నిరాశతో వెనుదిరిగారు.. ఎప్పుడెప్పుడు నింగిలోకి రాకెట్‌ దూసుకుపోతుందా అని అనుకున్న వారంతా అధికారుల ప్రకటనతో ఉసూరుమన్నారు..

అంతా సవ్యంగా ఉంటే చంద్రయాన్‌-2 ప్రయోగం సక్సెస్‌ అనే మాట దేశవ్యాప్తంగా వినిపించి ఉండేది.. నిర్దేశించుకున్న సమయానికి జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ చంద్రయాన్‌-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఉండేది.. కానీ, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో చంద్రయాన్‌-2లోని అన్ని వ్యవస్థలకు తుది పరీక్షలు నిర్వహించారు. రాకెట్ ఇంజిన్‌లో ఇంధనాన్ని నింపారు.. అయితే, క్రయోజనిక్‌ ఇంధన సరఫరాలో లోపాన్ని ముందుగానే గుర్తించిన శాస్త్రవేత్తలు.. ప్రయోగాన్ని నిలిపివేశారు. శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు క్రయోజనిక్‌ ఇంజిన్‌ కీలకం.. అయితే, ఇక్కడే లోపాలు తలెత్తడంతో సైంటిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరపాట్లు తలెత్తినా సరిదిద్దుకుని పదినిమిషాల సమయంలో లాంచ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.. అయితే, సమస్య పెద్దది కావడంతోనే ఛాన్స్‌ తీసుకోకూడదని అధికారులు భావించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్‌లోనూ ఇస్రో పోస్ట్‌ చేసింది. చంద్రయాన్‌-2 వాయిదా పడటంతో మళ్లీ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.. నిర్దిష్ట సమయంలో ప్రయోగం జరకపోవడంతో అనువైన సమయం కోసం ఇస్రో అధికారులు ఎదురు చూస్తున్నారు..

Next Story

RELATED STORIES