పోస్టర్ నిజమైంది.. చావు దగ్గరైంది..

పోస్టర్ నిజమైంది.. చావు దగ్గరైంది..
X

నటులంటే ఎన్నో వేషాలు.. ఓ సినిమాలో విలన్‌గా హీరో చేతిలో ఛస్తాడు. మరో సినిమాలో అతడే హీరో. చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించినా అది నటనే అని సరిపెట్టుకుంటాం బయటకు వచ్చాక. అయితే ఈ మద్య వచ్చే సినిమాలు రిలీజ్‌కు ముందు వినూత్న ప్రచారంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే తమిళనాడు తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్‌ఎస్ గోపాల్ అనే వ్యక్తి సినిమాలో నటించాడు. అందులోని సన్నివేశంలో భాగంగా అతడు మరణిస్తాడు. ఆ నటుడు వారం రోజులు తిరక్కుండానే నిజంగానే మరణించాడు. వంటపని, శుభ, అశుభ కార్యక్రమాలకు షామియానా సరఫరా చేసే గోపాల్.. మా టెంట్ హౌస్‌లో గరిట నుంచి గజరాజు వరకు అన్నీ దొరకును అనే చిత్రమైన నినాదంతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తుంటాడు. గోపాల్‌కు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేశాడు.

ఆ సినిమాలో అతను విలన్.. పాత్ర పరంగా అతను చనిపోవడం.. కన్నీటి అంజలి అని వీధుల్లో పోస్టర్లు వెలియడం లాంటి దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలను గోపాల్ వాట్సాప్ ద్వారా సరదాగా బంధుమిత్రులకు పంపాడు. సడెన్‌గా అలా ఎలా చనిపోయాడు అనుకుని బాధాతప్త హృదయాలతో గోపాల్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులు అతడి ఇంటికి చేరుకున్నారు. తీరా చూస్తే గోపాల్ హాయిగా ఇంట్లో కూర్చుని ఉన్నాడు. సినిమాలో దృశ్యం అది అని నవ్వుతూ వివరించాడు. దాంతో వారంతా సర్లే నువ్వు పది కాలాలపాటు క్షేమంగా ఉండాలి అంటూ ఆశీర్వదించి వెళ్లిపోయారు. కానీ ఇంతలో వారం రోజులకి మళ్లీ గోపాల్‌కి శ్రద్ధాంజలి అంటూ ఊరంతా పోస్టర్లు వెలిశాయి. ఇది కూడా సినిమాలో భాగమే అనుకున్నారు. నిజమని తెలిసి అవాక్కయ్యారు అంతా. సరదాగా అనుకున్నది నిజమైంది అని బంధువులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనారోగ్యంతో గోపాల్ మరణించాడని తెలుసుకున్నారు. తన చావు పోస్టర్లను తానే ప్రచారం చేసుకున్న వారం రోజులకే గోపాల్ నిజంగానే మరణించడం ఆశ్చర్యకరమైన ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది.

Next Story

RELATED STORIES