కర్ణాటక రాజకీయం.. సుప్రీం తీర్పే కీలకం..

కర్ణాటక రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. అసంతృప్తి సెగలు చిట్టచివరికి బల పరీక్షకు దారి తీశాయి. తాజా పరిణామాలతో బల పరీక్షకు సిద్ధమవడమే సరైన నిర్ణయమని సీఎం కుమార్‌ డిసైడ్‌ అయ్యారు. దీంతో 18వ తేదీ ఉదయం 11 గంటలకు బలపరీక్ష ఉంటుందని సీఎల్పీ నేత సిద్ధరామయ్య చెప్పారు. ఫ్లోర్ టెస్ట్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

బలపరీక్షకంటే ముందు కోర్టు తీర్పుపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా కేసు ప్రస్తుతం సుప్రీంలో ఉంది. ఇవాళ మరో ఆరుగురు ఎమ్మెల్యేల కేసుల విచారణకు రాబోతున్నాయి. మరి సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపైనే బలపరీక్ష ఆధారపడి ఉంటుంది. సుప్రీం తీర్పు తరువాతే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం బెంగళూరులో నాటకీయ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. బల పరీక్షపై కర్ణాటక అసెంబ్లీ దద్దరి ల్లింది. సీఎం కుమారస్వామి విశ్వాసం నిరూపించుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. బలం నిరూపించు కోవడానికి తాము సిద్దంగా ఉన్నామంటూ సీఎం వర్గీయులు ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

బలపరీక్ష సమయంలో అసెంబ్లీ హాజరు కాకూడదని క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ తమ బలం నిరూపించుకునే సమయంలో సభకు హాజరై.. వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటు పడుతుందని.. దానికంటే తామే సభకు వెళ్లకుండా ఉంటే గౌరవంగా ఉంటుందని రెబల్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకుల నుంచి తమకు ముప్పు ఉందని రెబల్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమకు భద్రత కల్పించాలని ముంబై పోలీసులను ఆశ్రయించారు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులతో కలవడం, మాట్లాడడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. స్పీకర్‌ సాయంతో గండం గట్టెక్కుదామని కాంగ్రెస్-జేడీఎస్ చేసిన ప్రయత్నాలను ఫలించే అవకాశం కనిపించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సీఎం కుమారస్వామి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎంటీబీ నాగరాజు వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ అసంతృప్తులతో చేరిపోయారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ క్షణ క్షణం పెరుగుతోంది. ముఖ్యంగా సుప్రీం తీర్పు తరువాత.. పరిణామాలు అనూహ్యాంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES