ఆఫీస్ టైంలో టిక్ టాక్ వీడియోలు.. చివరకు..

ఆఫీస్ టైంలో టిక్ టాక్ వీడియోలు.. చివరకు..

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారంపై కమిషనర్‌ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 9 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధులను మార్చుతూ.. ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం నగరపాలక కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సిన సమయంలో సిబ్బంది టిక్‌టాక్‌ చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్యోగులు.. తమ విధులను పక్కన పెట్టి టిక్‌ టాక్‌లో టాలెంట్‌ చూపిస్తున్నారు. డ్యాన్సులు.. డైలాగ్‌లతో టికెటాక్‌ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గత కమిషనర్‌ కొందరిని హెచ్చరించారు.. మరికొందరికి నోటీసులు ఇచ్చారు.. అయినా అక్కడి సిబ్బంది వైఖరిలో మార్పు కనిపించడం లేదు.

ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయినప్పటి నుంచి ఎన్నో సమస్యల్లో చిక్కుకుంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికార యంత్రాంగంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా అధికారులు, సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. ప్రజా సమస్యలను గాలికి వదిలి.. టిక్‌టాక్‌ వీడియోలతో సమయాన్ని వృథా చేస్తున్నారు.

కార్పొరేషన్‌ విభాగాల్లో సానిటేషన్‌, రోడ్లు, డెత్‌, బర్త్‌ సర్టిఫికేట్ల కోసం జనం గగ్గోలు పెడుతున్నా.. నెలల తరబడి సామాన్య ప్రజల్ని తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. తాము బిజీగా ఉన్నామని చెబుతూ పలుమార్లు తిప్పుంచుకుంటున్నారు. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. కార్పొరేషన్‌ ఉద్యోగులు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.. కొత్త కమిషనర్‌ కల్పించుకుని ప్రజా సమస్యలను పక్కన పెట్టిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story