పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సహాయ పునరావాస చర్యల్లో అవకతవకలు జరిగినట్లు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని రాజ్యసభ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. ఇటు ఏపీ అసెంబ్లీలోనూ పోలవరంపై అధికార వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పి కొట్టారు. తమపై బురద జల్లితే ఊరుకునేది లేదని.. పోలవరంలో అక్రమాలు జరిగాయనుకుంటే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టును మాజీ సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నుంచి సక్రమంగా నిధులు రాకపోయినా.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత ఐదేళ్లు అహర్నిశలు ప్రయత్నించారు. దాదాపు 70 శాతం తాను ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు చెబుతున్నా.. ప్రస్తుత అధికార పార్టీ, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు తీరును తప్పు పడతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పోలవరంపై ఇటు అసెంబ్లీలో, అటు రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.

రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జైరాం రమేష్, డి.రాజా పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలు, R అండ్ R ప్యాకేజీ, కేంద్ర సాయం, సవరించిన అంచనాల ఆమోదం తదితర అంశాలపై విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీశారు. విపక్ష సభ్యుల ప్రశ్నలపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గత టీడీపీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస కార్యకలాపాలలో అవకతవకలు జరిగినట్లు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన స్పష్టం చేశారు. సహాయ పునరావాస కార్యకలాపాలు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. నిర్వాసితుల విషయంలో గిరిజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కమిటీని నియమించామని, సవరించిన అంచనాల ఆమోదానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు.

ఇటు ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీని సైతం పోలవరం అంశం కుదిపేసింది. పోలవరంపై మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్ట్‌ అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. చేసిందేమీలేదని విమర్శించారు. దీంతో అధికార పార్టీ ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. తమ హయాంలోనే పోలవరాన్ని 70 శాతానికి పైగా పూర్తి చేశామని అన్నారు. భూసేకరణ చట్టం వచ్చాకే పరిహారం భారీగా పెరిగిందన్నారు టీడీపీ అధినేత.

తమపై వైసీపీ సర్కార్‌ బురద చల్లితే ఊరుకునేది లేదని సభ వేదికంగా చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. పోలవరంలో అవీనితి జరిగిందని నిరూపించాలని అనుకుంటే తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. అవినీతి కోసమే పోలవరం అంచనాలు పెంచామని ఆరోపిస్తోన్న వైసీపీ...16 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి లేఖ రాయగలదా అని సవాల్ విసిరారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అధికార పార్టీ పోలవరంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం బాబు పాలనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం గత సర్కార్‌కు పోలవరం విషయంలో క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో.. టీడీపీ వాదనకు కాస్త బలం పెరిగినట్టు అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story