ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఇవాళ అర్థరాత్రి..

ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఇవాళ అర్థరాత్రి..

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇవాళ అర్థరాత్రి పాక్షిక చంద్ర గ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేయనుంది. గురు పౌర్ణిమ పర్వదినం తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. కొన్ని గంటల తేడాతో రెండు సందర్బాలు రావడం చాలా అరుదుగా జరిగే ఘటనగా చెబుతున్నారు. 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి. మళ్లీ 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం వస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు గురుపౌర్ణమి ఘడియలు ఉండగా.. నేటి అర్థరాత్రి 12 గంటల 12నిమిషాలకు చంద్రగ్రహణం మొదలై తెల్లవారుజాము 5గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈ ఏడాదిలో ఏర్పడే రెండో, చివరి చంద్రగ్రహణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు మూతపడ్డాయి. ధర్మపురిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానాలను మూసివేశారు..సంప్రోకణ, ఆలయశుద్ధి చేసిన తర్వాత మళ్లీ భక్తులను అనుమతించనున్నారు...

విజయవాడలోని దుర్గమ్మ దేవస్థానాన్ని మూసివేశారు. తర్వాతి రోజు దేవస్థాన ప్రక్షాళన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవల్ని కూడా రద్దు చేశారు. నరసరావుపేటలోని శైవక్షేత్రమైన కోటప్పకొండ ఆలయాన్ని మధ్యాహ్నమే మూసివేశారు..

తిరుమల శ్రీవారి ఆలయాన్ని మరికాసేపట్లో మూసివేయనున్నారు.మళ్లీ బుధవారం ఉదయం నాలుగున్నరకు తెరుస్తారు. ఆలయశుద్ధి, పుణ్యవచనం తరువాత స్వామి వారికి సుప్రభాత సేవ చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా టీటీడీ ఆధ్వర్యంలోని 30 వైష్ణవ ఆలయాలను కూడా మూసివేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story