జీవన రంగస్థలం నుంచి శాశ్వతంగా.. అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా 'రంగనాథ్'

జీవన రంగస్థలం నుంచి శాశ్వతంగా.. అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా రంగనాథ్

ఆరడుగుల విగ్రహం.. అందగాడు.. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే ప్రతిభ.. వెరసి రంగనాథ్.. హీరోగా వచ్చి విలన్ గా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించి.. అన్ని పాత్రల్లోనూ అలవోకగా ఒదిగిపోయిన రంగనాథ్ ప్రతిభావంతమైన తెలుగు నటుల్లో ముందు వరుసలో ఉండే నటుడు. కవిగా, రచయితగానూ ఎంతోమంది మనసులు దోచి.. అనూహ్యంగా ఆఖరి పేజీ రాసుకున్న ఈ విలక్షణ నటుడి జయంతి సందర్భంగా..

తెలుగులో మనకున్న అతితక్కువ విలక్షణమైన నటుల్లో రంగనాథ్ ఒకరు. కాస్త ఆలస్యంగా సినిమాల్లోకి రావడం వల్ల ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయారనేది అందరికీ తెలుసు. అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రంగనాథ్ ప్రొఫెషనల్ లైఫ్ లోనూ, పర్సనల్ లైఫ్ లోనూ కొన్ని విషయాలు చాలా తొందరగా జరిగిపోయాయి. అందులో ఆయన మరణమూ ఒకటి. అయినా.. నటుడుగా ఆయన ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటారు..

తిరుమల సుందర శ్రీరంగనాథ్. ఇదీ రంగనాథ్ అసలు పేరు. ఆయన పుట్టింది చెన్నైలో. కుటుంబంలో సినిమా నేపథ్యం లేదు. కానీ వారి అమ్మగారు మంచి గాయని. తను గాయనిగా రాణించలేకపోవడంతో కొడుకునైనా కళాకారుడుగా చూడాలనేది ఆమె కల. అందుకు తగ్గట్టుగానే చదువుకునే రోజుల్నుంచీ రంగనాథ్ నాటకాల్లో వేషాలు వేసేవారు. అలా నాటకాలు వేస్తూ చదువుకుని.. సినిమా రంగంలోనూ ప్రయత్నాలు చేశారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల రైల్వేశాఖలో టిసిగా ఉద్యోగంలో చేరారు.

ఉద్యోగం చేస్తూ నాటకాల్లోనూ నటించేవారు. ఆ సమయంలో బాపుగారు బుద్ధిమంతుడు సినిమా చేస్తున్నారు. ఇందులో టాటా వీడుకోలు పాట చిత్రీకరణ కోసం చెన్నై నుంచి ఆర్టిస్టులను పిలిపించాల్సి ఉందట. కానీ అంత దూరం నుంచి ఎందుకు ఇక్కడి వారితోనే చేయిద్దాం అనుకుని రసరంజని నాటక సంఘం వారిని పిలిచారు. తనను తాను స్క్రీన్ పై చూసుకోవడానికి రంగనాథ్ కూడా వెళ్లారు. ఆ పాటలో ప్లూటిస్ట్ గా కనిపిస్తారు రంగనాథ్. ఒక్కటే క్లోజప్ షాట్. ఒకటే షాట్ లో కనిపించినా.. నటుడుగా ప్రయత్నాలు ఆపలేదు రంగనాథ్. అయితే ఆయనలోని స్పార్క్ ను పట్టేశారు బాపు. తన అందాలరాముడు సినిమాలో రాముడి వేషం కోసం రంగనాథ్ ను తీసుకోవాలనుకున్నారు. అదే సమయంలో రంగనాథ్ కు చందన అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ విషయం బాపుకు చెబితే హీరోగానే చేయమన్నారు. ఆ సినిమా చేస్తోన్న టైమ్ లో మరో రెండు హిట్ సినిమాలు వదలుకోవాల్సి వచ్చిందట. ఆ రెండు సినిమాలు చేసిన అప్పటి నటులు హీరోలుగా సెటిల్ అయిపోయారు. కానీ చందన పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మూడేళ్ల వరకూ చాలా సినిమాలు చేశారు..

ఎన్ని సినిమాలు చేసినా.. ఎవరికైనా బ్రేక్ రావడం ముఖ్యం. ఆ బ్రేక్ రంగనాథ్ కు నటుడుగా కెరీర్ మొదలుపెట్టిన మూడేళ్ల తర్వాత వచ్చింది. పంతులమ్మ సినిమాతో ఆయన ఎంతోమందికి అభిమాన నటుడిగా మారిపోయాడు. పంతులమ్మ సినిమా రంగనాథ్ కు స్టార్ హీరో హోదా తెచ్చేసింది. ఈ సినిమా తర్వాత కంటిన్యూస్ గా హిట్స్ కొట్టారు. ముఖ్యంగా తను చేసిన సినిమాల వల్ల రంగనాథ్ కు మహిళాభిమానులు బాగా పెరిగారు. రంగనాథ్ కు బిగ్గెస్ట్ ప్లస్ ఆయన విగ్రహం.. వాయిస్. అందగాడు కూడా. కొంత వరకూ కృష్ణంరాజులా కనిపించినా.. ఇద్దరి ఇమేజ్ లు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆయన మాస్ హీరోగా ఎస్టాబిష్ అయితే రంగనాథ్ క్లాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన చేసే పాత్రల్లోనే ఉదాత్తత నాటి ప్రేక్షకుల్లో ఆయనకు మరింతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.

హీరోగా చేస్తూనే.. మల్టీస్టారర్స్ లోనూ నటించారు రంగనాథ్. నాటి మేటి హీరోయిన్లు వాణిశ్రీ, శారద వంటి హీరోయిన్లతో నటించారు. ఈ సినిమాల్లోనూ ఆయనవి ఉదాత్తమైనవో లేక.. త్యాగపూరితమైనవీ లేదంటే ప్రేమ దక్కలేదని కొంత విద్వేషంగా ప్రవర్తించే పాత్రలూ చేశారు. ఏం చేసినా ఆ పాత్రల్లో అత్యంత సహజంగా ఒదిగిపోవడం రంగనాథ్ కు మాత్రమే సాధ్యమైన శైలి.

హీరోగా రంగనాథ్ ప్రభ ఎక్కువ కాలం సాగలేదు. అయినా ఉన్నంత కాలం తన ఇమేజ్ పరిధిలో ఊపేశారనే చెప్పాలి. ముఖ్యంగా రంగనాథ్, ప్రభలది మంచి జోడీగా పేరు తెచ్చుకుంది. ఇద్దరూ నిజమైన జంటేమో అన్నంత సహజంగా నటించేవారు. అందుకే వీరిది హిట్ పెయిర్ గా గుర్తింపు వచ్చింది. ఇంటింటి రామాయణం నుంచే ఈ జంటకు అభిమానులూ మొదలయ్యారు. మల్టీస్టారర్ సినిమాల్లోనూ రంగనాథ్ శైలి భిన్నంగా ఉండేది. తనో స్టార్ హీరో అని కాకుండా పాత్రకు తగ్గట్టుగానే నటించేవారు. తనతో పాటు ఉన్న హీరో ఎవరైనా ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేవారు. వ్యక్తిగతంగానూ చాలామందికి రంగనాథ్ లో నచ్చేదే ఇది. ఆయన వెల్ మానర్డ్ పర్సన్. చాలా హుందాగా ప్రవర్తించేవారనే పేరు బాగా ఉండేది.

అప్పటి స్టార్ డైరెక్టర్ విఠలాచార్య సినిమాలోనూ హీరోగా నటించారు రంగనాథ్. మదన మంజరి అనే ఈ సినిమా కంప్లీట్ గా విఠలాచార్య మార్క్ మూవీ. అయితే ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. జయమాలిని, రంగనాథ్ ల మధ్య వచ్చే డ్యూయొట్స్ మాత్రం ఇప్పుడు విన్నా హుషారుగా అనిపిస్తాయి.. అయితే కొన్నాళ్ల తర్వాత విఠలాచార్య చెప్పిన జాతకం రంగనాథ్ జీవితాన్నే మార్చివేసింది.

రంగనాథ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికే ఆయన వయసు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన హీరోల్లా ఉంది. అంటే కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చారన్నమాట. అందుకే హీరోగా మాత్రమే చేయాలని ఫిక్స్ అయిపోలేదు. ఒక్కోసారి ప్రాధాన్యత ఉంది అనుకుంటే ఇతర పాత్రల్లోనూ కనిపించారు. మెప్పించారు.. హీరోగానో, మల్టీస్టారర్స్ లోనో మంచి సినిమాలు చేస్తోన్న టైమ్ లో సడెన్ గా కెరీర్ డౌన్ అయింది. అందుకు వరుసగా కొన్ని సినిమాలుపోవడం ఓ కారణం అయితే.. అంత సడెన్ గా ఆఫర్స్ తగ్గడం అతన్నే కాదు.. చాలామందిని ఆశ్చర్యపరిచింది. అంతకు ముందు విఠలాచార్య చెప్పింది ఇదే. రంగనాథ్ చెయ్యిచూసి కొన్నాళ్ల వరకూ నీకు ఇబ్బందులు తప్పవు అన్నారట. అదే నిజమైంది. అందుకే చిరంజీవిని మెగాస్టార్ గా చేసిన ఖైదీలో హీరోగా చేయాల్సిన రంగనాథ్ చివరికి ఆ సినిమాలో పోలీస్ గా నటించాల్సి వచ్చింది. హీరోగా అవకాశాలు తగ్గడం మొదలైన తర్వాత కొన్నాళ్లు ఇతర పాత్రల వైపు వెళ్లాలా వద్దా అని ఆలోచించారు. కానీ ఎన్నాళ్లలా ఉంటారు. అందుకే కృష్ణంరాజు సలహాతో విలన్ గా మారాడు. అప్పటి వరకూ సాఫ్ట్ హీరో ఇమేజ్ ఉన్న రంగనాథ్ విలన్ గానూ ఆకట్టుకున్నాడు. దీంతో కొంతకాలం పాటు కంటిన్యూస్ గా విలన్ పాత్రలే చేస్తూ వెళ్లారు. మొత్తంగా హీరోగా యాభైకి పైగా సినిమాల్లో నటించారు. అలాగే విలన్ గానూ అంతకంటే ఎక్కువ సినిమాల్లో చేశారు. కానీ రంగనాథ్ విలనీ మరీ అంత క్రూరంగా ఉండేది కాదు. క్యారెక్టర్ ను బట్టి వాయిస్ డామినేషన్ లోనే ఎక్కువ విలనీ పండించారు. అయితే విలన్ గానూ సూపర్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. పైగా అప్పటికే రావుగోపాలరావు, సత్యనారాయణ వంటి ఉద్ధండులైన విలన్స్ హవా నడుస్తోంది. దీంతో విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ పాత్రలో మాత్రం తనదైన ప్రత్యేకత చూపించేవారు.

హీరోనా, విలనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా.. ఏం చేసినా సరే.. ఆయన హీరోగా చేసినప్పుడు ఏర్పడ్డ అభిమానులు మాత్రం ఆయన్ని అన్ని దశల్లోనూ ఆదరించారు. ఆయన ఏ పాత్ర చేసినా ఇష్టపడ్డారు.. సంఖ్యా పరంగా తక్కువే అయినా.. ఇలా సెటిల్డ్ ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది నటుల్లో రంగనాథ్ ఒకరు. ఆర్టిస్ట్ కు ఎంత టైమింగ్ ఉన్నా.. టైమ్ కూడా కలిసి రావాలి. అప్పుడే అతని ప్రతిభ అందరికీ తెలుస్తుంది. అందుకే కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ఎత్తులు చూసినా.. ఆ టైమ్ కలిసి రాకపోవడంతో మళ్లీ డౌన్ అయింది రంగనాథ్ కెరీర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత మళ్లీ ఆయన టైమ్ మొదలైంది. అప్పటి నుంచి ఆఖరు వరకూ అనేక పాత్రల్లో కనిపించారు. అదే ఊపులో మొగుడ్స్ పెళ్లామ్స్ అనే సినిమానూ డైరెక్ట్ చేశారు. బట్ ఇది పెద్దగా ఆడలేదు. దీంతో మళ్లీ మెగాఫోన్ వైపు వెళ్లలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత బాగా బిజీ అయ్యారు రంగనాథ్. అనేక రకాల పాత్రల్లో అలవోకగా నటిస్తూ.. అన్ని రకాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల తర్వాత టివి సీరియల్స్ లోనూ నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ లో చేసిన పాత్ర ఎంతో పేరు తెచ్చింది. తర్వాత ఇద్దరు అమ్మాయిలు, అత్తోఅత్తమ్మ కూతురో సీరియల్స్ లో ప్రధాన పాత్రల్లో నటించారు.

చాలాకాలం క్రితమే ఆయన భార్య డాబా పై నుంచి పడిపోయి మంచానికే పరిమితమయ్యారు. ఆమెకు సపర్యలు చేస్తూ కన్నబిడ్డలా చూసుకున్నారు. 2009లో ఆమె మరణించిన తర్వాత బాగా కుంగిపోయారు. ఒంటరితనం ఆవరించడంతో నిస్పృహలో నిండిపోయారు. అందరికీ దూరంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. తను మూడ్ ఆఫ్ లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా అవకాశాలిచ్చినా వద్దనుకున్నారు. కానీ చాలామంది అవకాశాలు రాక ఇబ్బందిపడ్డాడనుకున్నారు.

డిసెంబర్ నెలలో కొంతమంది క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ.. రంగనాథ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి సన్మానించాలనుకున్నారు. సాయంత్రం సన్మానం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో దగ్గరుండి తీసుకురావడానికి నిర్వాహకులు కొందరిని పంపించారు. వాళ్లు వెళ్లి తలుపులు తట్టారు. కానీ తెరుచుకోలేదు. పక్కనే ఉండే ఆయన కూతురిని పిలిచి.. తలుపులు పగలగొట్టారు. అంతే.. అంత పెద్ద నిండైన విగ్రహం నిర్జీవంగా తాడుకు వేలాడుతూ కనిపించింది. రంగనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మనసును ఏ కారుమబ్బులు కమ్ముకున్నాయో కానీ.. బలవంతంగా కన్నుమూయాలని నిర్ణయించుకున్నారు. అలా 2015 డిసెంబర్ 19న ఓ విలక్షణ నటుడు తన జీవన రంగస్థలం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు.

Tags

Read MoreRead Less
Next Story