సుప్రీం తీర్పుతో కర్నాటకలో కీలక మలుపు

సుప్రీం తీర్పుతో కర్నాటకలో కీలక మలుపు

కర్నాటకలో రేపటి బలపరీక్షకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రిజైన్ల విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీకి వెళ్లాలా, వద్దా అనేది ఎమ్మెల్యేల ఇష్టమని, ఆ 15 మంది ఎమ్మెల్యేలు సభకు రావాలని ఎవరూ బలవంత పెట్టలేరని చెప్పింది. రిజైన్ల ఆమోదానికి స్పీకర్‌కు కాలపరిమితి పెట్టలేమని కూడా తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ పోషించాల్సిన పాత్రపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతానికి ఈ కేసులో రెబల్స్‌ రాజీనామాలపై నిర్ణయం స్పీకర్‌దేనని వివరించింది. సభాపతి విచక్షణాధికారాల విషయంలో తమ జోక్యం ఉండబోదని పేర్కొంది.

అటు, విశ్వాస పరీక్షకు సిద్ధమైన కాంగ్రెస్‌-జేడీఎస్ కూటమి రెబల్స్‌ ప్రభావాన్ని తేలిగ్గా తీసుకుంది. వాళ్లు సభకు వచ్చినా, తమకు అనుకూలంగా ఓటు వేసే పరిస్థితి లేదు కాబట్టి.. తమ బలంతోనే గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అటు, బీజేపీ కూడా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రేపు కుమారస్వామి బలం నిరూపించుకోవాల్సిందేనని యడ్యూరప్ప అన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, వాటి ఆమోదం లాంటి ఎఫెక్ట్ బలపరీక్షపై ఉండదని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story