శరవణ భవన్‌ హోటల్స్‌ యజమాని రాజగోపాల్‌ మృతి

శరవణ భవన్‌ హోటల్స్‌ యజమాని రాజగోపాల్‌ మృతి
X

మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను దారుణంగా హత్య చేయించిన శరవణ భవన్‌ హోటల్స్‌ యజమాని దోశె కింగ్‌ రాజగోపాల్‌ గురువారం మరణించారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇటీవ‌ల గుండెపోటు రావ‌డంతో ఆయన వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. హ‌త్య కేసులో లొంగిపోయేందుకు మ‌రింత స‌మ‌యం కావాలని ఇటీవ‌లె రాజ‌గోపాల్ అభ్యర్థన పెట్టుకున్నారు. కానీ ఆ రిక్వెస్ట్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఆయన అంబులెన్సులోనే వ‌చ్చి చెన్నైలోని స్థానిక కోర్టులో లొంగిపోయారు.

2001లో జ‌రిగిన హత్యకేసులో ఈ నెల 7న రాజ‌గోపాల్‌కు జీవిత‌కాల శిక్ష ప‌డింది. రెండు వివాహాలు చేసుకున్న రాజ‌గోపాల్‌ మూడో పెళ్లితో అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పడంతో అసిస్టెంట్ మేనేజర్ కుమార్తెను పెళ్లి కోసం బలవంతపెట్టారు. అంగీకరించని ఆమె మ‌రో వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. 2001లో ఆమె భ‌ర్తను రాజ‌గోపాల్‌ హత్య చేయించారు. 2004లో స్థానిక కోర్టు రాజ్‌గోపాల్‌తోపాటు మరో 8 మందిని దోషులుగా నిర్ధారించి పదేళ్ల జైలుశిక్ష విధించింది. మద్రాసు హైకోర్టులో బాధితులు అప్పీల్ చేయగా యావజ్జీవశిక్షగా మార్పు చేశారు.

యావజ్జీవ శిక్షపై దోశె కింగ్‌ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ఆయన కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగుతుండగా ప్రాణాలు విడిచారు. రాజగోపాల్‌కు శరవణ భవన్‌ పేరుతో దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున చైన్‌ హోటల్స్‌ ఉన్నాయి. కిందస్థాయి నుంచి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పరస్త్రీ వ్యామోహం, హత్య ఘటనలతో రాజగోపాల్‌ పరువు పోగొట్టుకున్నారు. చివరికి జీవిత ఖైదు శిక్ష ఎదుర్కొని అనారోగ్యంతో చనిపోయారు.

Next Story

RELATED STORIES