సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేసే ప్రసక్తే లేదు - రెబల్‌ ఎమ్మెల్యేలు

సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేసే ప్రసక్తే లేదు - రెబల్‌ ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. అసెంబ్లీలో బలాబలాలు లెక్కలు ఎలా వేసుకున్నా.. సీఎం కుమారస్వామి బలపరీక్ష పాసవ్వడం అసాధ్యమని తేలిపోతోంది. రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు ససేమిరా అంటున్నారు. హాజరైనా ప్రస్తుత సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేసే ప్రసక్తే లేదంటున్నారు.

ఇదిలా ఉంటే, అందరి దృష్టి ప్రస్తుతం అసంతృప్తి ఎమ్మెల్యేలు, స్పీకర్‌పైనే పడింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు.? స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? అన్న ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా, వారిపై అనర్హత వేటు వేసినా ప్రభుత్వం పడిపోవడం ఖాయం. ఐతే, అసెంబ్లీకి హాజరయ్యే ప్రసక్తే లేదని రెబల్స్ మరోసారి తేల్చి చెప్పారు. రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని పదే పదే చెబుతున్నారు.

సుప్రీం తీర్పు సైతం కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠను ఇంకాస్త పెంచింది. అసంతృప్తుల రాజీనామాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ నిర్ణయాధికారంలో జోక్యం చేసుకోబోం అంటూ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎలా వ్యవహరించాలో స్పీకర్‌దే తుది నిర్ణయమని తీర్పు ఇచ్చింది. అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించుకోడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు రెబల్‌ ఎమ్మెల్యేలకు బిగ్‌ రిలీఫ్‌ అయ్యింది సుప్రీం తీర్పు. ఎమ్మెల్యే లను బలవంతం గా అసెంబ్లీకి పంపించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా ఇరు వర్గాలకు అనుకూలంగా తీర్పు ఉండడంతో.. ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

రాజీనామాలపై స్పీకర్‌దే ఫైనల్‌ నిర్ణయం అని చెప్పినా.. ఎమ్మెల్యేలను బలవంతం చేయలేమని న్యాయస్థానం చెప్పడం కుమారస్వామి ప్రభుత్వానికి చేదు వార్తే కానుంది. రెబల్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా బలపరీక్షకు సిద్ధమైతే.. 105 మ్యాజిక్‌ ఫిగర్‌ అవుతుంది. ప్రస్తుతం 101 మాత్రమే ప్రభుత్వ బలం ఉంది. దీంతో ప్రభుత్వం కచ్చితంగా పడిపోతోంది. ఇలాంటి సమయంలో బల పరీక్షను కొన్ని రోజులు వాయిదా వేయడమే బెటరని కొందరు కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం వెంటనే బల పరీక్ష పెట్టాలని డిమాండ్‌ చేస్తోంది. మరి స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే క్లైమాక్స్‌ హిట్టా.. ఫట్టా అన్నది ఆధారపడి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story