ఏ ముహూర్తాన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో..

ఏ ముహూర్తాన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో..

మే- 23, 2018, కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన రోజిది. ఏ ముహూర్తాన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో కానీ.. అప్పటి నుంచి అన్నీ కష్టాలే. నిత్యం ఏడుపులు, పెడబొబ్బలే. 3 వివాదాలు.. 6 అలకలు అన్నట్లు సాగింది పరిపాలన. లక్కు కలిసొచ్చి సీఎం అయిన కుమారస్వామికి చుక్కలు చూపెట్టింది కాంగ్రెస్. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం అంచున నిలిపాయి కాంగ్రెస్-జేడీఎస్! గత 15 రోజులుగా కర్ణాటక రాజకీయాలు ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించాయి. ఇక ఈ కన్నడ మూవీ క్లైమాక్స్ ఎలాంటి టర్న్ తీసుకోనుంది అన్నది అత్యంత ఇంట్రెస్టింగ్ గా మారింది..

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కర్ణాటక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. రాజీనామాలపై తుది నిర్ణయం ఆయనదేనని తేల్చిచెప్పింది. అదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలను బలపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఎవరూ బలవంత పెట్టలేరని కూడా తీర్పునిచ్చింది. ఇప్పుడు బంతి మళ్లీ స్పీకర్ రమేష్ కుమార్ కోర్టులోకి వచ్చిపడింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి స్పీకర్ ముందు 3 ప్రధాన ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి రాజీనామాలను ఆమోదించడం, రెండు అనర్హత వేటు వేయడం, మూడు బలపరీక్షను వాయిదా వేయడం. ఇందులో స్పీకర్ ఎంచుకునే ఆప్షన్ కుమారస్వామి సర్కారు భవితవ్యాన్ని డిసైడ్ చేయనుంది..

అయితే శుక్రవారం జరిగే బలపరీక్ష ఏ రకంగా చూసినా బీజేపీకే అనుకూలంగా కనిపిస్తోంది. స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించినా, అది అనర్హత వేటు వేసినా సర్కారు పడిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. పోనీ రెబెల్‌ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉన్నా, అది కూడా బీజేపీకే మేలు చేస్తుంది. పైగా ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు తమ స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పేశారు.. విశ్వాసపరీక్షకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు..

కర్ణాకట అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా 16 మంది రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదిస్తే సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోతుంది. అప్పుడు మ్యాజిక్‌ ఫిగర్‌ 105కు చేరుతుంది. ప్రస్తుతం అసెం‍బ్లీలో బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కలపుకొని 107 మంది సభ్యుల బలముంది. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 80కాగా, 13మంది రాజీనామా చేశారు. జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 37 కాగా, ముగ్గురు రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 101 మాత్రమే. అంటే ఏరకంగా చూసిన ప్రభుత్వం మ్యాజిక్ సంఖ్యను చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది..

అయితే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. అనర్హత వేటుని బూచిగా చూపి 16 మందిలో కనీసం 8 మందిని వెనక్కుతీసుకురాగలిగినా ప్రస్తుతానికి గట్టెక్కవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెబల్స్ వెనక్కి తగ్గేపరిస్థితి కనిపించడం లేదు. ఇక స్పీకర్ ముందున్న చిట్టచివరి ఆప్షన్ ...తన విశేషఅధికారాలను ఉపయోగించి బలపరీక్షను వాయిదా వేయడం. ఇలా చేస్తే ఓడిపోయామని నైతికంగా ఒప్పుకున్నట్లే. పైగా వాయిదా తర్వాత కూడా మద్దతు కూడగట్టుకోలేకపోతే ఘోరమైన అవమానం కిందే లెక్క. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఏ మంత్రి పదవుల కోసం ఆశపడి వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చారో.. అవే పదవులు రాకుండా అడ్డుకోవచ్చు. పైగా కాస్త సానుభూతి కూడా పొందవచ్చు. మొత్తానికి కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ కోసం శుక్రవారం వరకు ఊపిరిబిగపట్టాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story