అన్నవరం క్షేత్రంలో గంజాయి అక్రమరవాణా

తిరుపతి తర్వాత అంత పేరున్న క్షేత్రం అన్నవరం. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇదే అదనుగా గంజాయి అక్రమరవాణా చేసే వారు అన్నవరాన్ని అడ్డాగా మార్చుకున్నారు. గత పది రోజుల్లో మూడుసార్లు గంజాయి పట్టబడటంతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు విస్మయానికి గురవుతున్నారు. మొదటగా విశాఖ ఏజెన్సీ నుంచి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ మీదుగా కోటనందూరుకు గంజాయి తరలిస్తున్నారు. అక్కడి నుంచి తేటగుంట జాతీయరహదారి మీదుగా అన్నవరం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌కుగానీ చేర్చుతున్నారు అక్రమార్కులు.
అన్నవరం చేరాక అక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్‌కు మరో ముఠా గంజాయి సరఫరా చేస్తుంది. తాజాగా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 16 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖకు చెందిన రాంబాబు అనే వ్యక్తి గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు జాతీయ రహదారి మండపం జంక్షన్ వద్ద ఆటోలో 40 కిలోల గంజాయి లభించింది. అటు పోలీసులు మాత్రం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని రొటీన్‌గా చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com