కామెడీ చెఫ్ 'రాజేంద్ర ప్రసాద్'.. కడుపుబ్బా నవ్వించగలడు.. కన్నీళ్లూ పెట్టించగలడు..

కామెడీ చెఫ్ రాజేంద్ర ప్రసాద్.. కడుపుబ్బా నవ్వించగలడు.. కన్నీళ్లూ పెట్టించగలడు..
X

ఎదురింట్లో పెళ్లాన్ని పెట్టుకుని పక్కింట్లో దిగిన పిసినారి. పాత గోడలమధ్య కొత్త జాకెట్లు కుడుతూ వేల నవ్వులతో కట్టిపడేసిన లేడీస్ టైలర్ అతను. చెట్టుకింద ప్లీడర్ నంటూ చెవిలో పువ్వులు పెట్టడంలో దిట్ట. ప్రేమతపస్సులు చేసి, తన అద్భుత నటనతో ఎర్రమందారాలు పూయించిన అతగాడు ఒట్టి మాయలోడు.. వెండితెర నవ్వులకు పట్టాభిషేకం చేసిన రారాజతడు. ఇన్ని చెప్పిన తర్వాత ఇతగాడు రాజేంద్రప్రసాద్ అని వేరే చెప్పాలా.. ఇవాళ ఈ తెలుగు చాప్లిన్ పుట్టిన రోజు. రాజేంద్ర ప్రసాద్‌.. ఇతను రవణారెడ్డి రాశిలో, రాజబాబు నక్షత్రంలో, రేలంగి రెండో పాదంలో సంపూర్ణ హాస్యపు ఘడియల్లో పుట్టాడు. తెలుగువారిని కోట్లాది నవ్వుల్లో ముంచెత్తాడు. కడుపునిండా కామెడితో ఫుల్‌ మీల్స్‌ పెట్టడం ఒక్కటే అతనికి తెలుసు... అందుకే అతన్ని కొందరు ఆంద్రా చాప్లిన్‌ అంటారు. మరికొందరు హాస్య కిరిటి అనీ నవ్వుల రారాజనీ అంటారు.

రాజేంద్రప్రసాద్.. పేరు వినగానే తెలియకుండానే నవ్వేసుకుంటాం.. నవ్వించడంలో అతను మాస్టర్ డిగ్రీ చేయలేదు కానీ.. అతను నవ్వులు పంచిన విధానంలో రీసెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా డాక్టర్ డిగ్రీ అందుకుంటారు. కామెడీకి హీరోయిజం ఆపాదించిన తొలి హీరో అతను. సినిమాల్లో కామెడీ ఉండాలి కానీ, సినిమాయే కామెడీ ఏంటన్నవాళ్లందరికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుల విందుపెట్టిన.. కామెడీ చెఫ్ రాజేంద్ర ప్రసాద్.

కొన్ని పాత్రలు అతని కోసమే పుడితే మరికొన్ని పాత్రలు అతను చేయడం ద్వారానే అజరామరం అయ్యాయి. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం అంటే ఏంటో రాజేంద్ర ప్రసాద్ ను చూస్తే అర్థమౌతుంది. సాధారణ పాత్రలు వేరు. ఓ కమెడియన్ చేయాల్సిన పాత్రలు వేరు. అందుకే అతను కామెడీకి కేరాఫ్ గా నిలిచాడు. సాధారణ పాత్రల్లోనూ అసాధారణ ప్రతిభ చూపించాడు. గద్దె రాజేంద్ర ప్రసాద్ అనబడే ఈ కామెడీ సైరన్ పుట్టింది కృష్ణాజిల్లా ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరులో. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి రావాలనుకున్నారు. అప్పటికే ఇంజినీరింగ్ అయిపోయింది. కానీ పర్సనాలిటీ చూస్తే కట్టెపుల్లలా ఉండేది. అందుకే మొదట్లో ఎన్టీఆర్ కూడా రాజేంద్రప్రసాద్ ను నటుడిగా కాదు ఇంకేదైనా ఉద్యోగం చేసుకోమన్నారు. కానీ వింటేగా. యాక్టింగ్ స్కూల్లో చేరి.. ఎన్నో అవార్డులూ గెలుచుకుని.. స్టూడెంట్ స్టేజ్ లోనే లెక్చరర్ గా మారిన మాయగాడితను.

యాక్టింగ్ స్కూల్ నుంచి నేరుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కానీ అవకాశాలు అంత ఈజీగా రాలేదు. అడపాదడపా వచ్చి చిన్న చిన్న వేషాలేస్తూ.. డబ్బింగ్ లు చెప్పడం మొదలుపెట్టాడు.. ఆ క్రమంలో వచ్చిన స్నేహం చిత్రంలోని అవకాశం ఆశలను పెంచితే.. చిరంజీవితో కలిసి వంశీ డైరెక్షన్ లో చేసిన మంచుపల్లకి గుర్తింపును పెంచింది. ఆ గుర్తింపు అదే యేడాది ఎనిమిది సినిమాల్లో వేషాలు పెంచినా బ్రేక్ తేలేకపోయింది.

కొన్ని స్నేహాలు.. మంచులా కరిగిపోయినా.. నదిలా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహంలాంటి స్నేహమే మంచుపల్లకితో రాజేంద్రప్రసాద్ కు వంశీతో ఏర్పడింది. ఇద్దరూ బ్రేక్ కోసం చూస్తోన్న టైమ్ అది. మంచుపల్లకి మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నా.. కాస్త సీరియస్ గా సాగే సబ్జెక్ట్ అది. అందుకే ఈ సారి వంశీ మరో కథను రెడీ చేసుకున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. పాయింట్ చిన్నదే. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలే.. ఆ రోజుల్లో ప్రతి ఊరిలోనూ కనిపించేవి. లేడీస్ టైలర్ కు ముందు ఈ ఇద్దరూ ఇక ఇంటికి వెళ్లాల్సిందేనా అనుకున్నారు. కానీ ఈ మూవీ తర్వాత ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.

లేడీస్ టైలర్ ను తెలుగులో పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా వచ్చిన సినిమాగా ముందు చెప్పొచ్చు. కామెడీని ఇష్టపడని వారెవరుంటారు. అందునా సజీవమైన పాత్రలతో సృష్టించిన కామెడీ కదా. లేడీస్ టైలర్ సూపర్ హిట్ అయింది. ఇలాంటి పాత్రలు చేయడం.. వాటిని తనదైన శైలిలో పండించడంలో రాజేంద్రప్రసాద్ తర్వాతే ఎవరైనా అని ఆ తర్వాత ఎన్నో సినిమాలతో నిరూపించుకున్నారు. మట్టి మట్టిగానే ఉంటే దాని విలువ తెలియదు. ఓ మంచి కుమ్మరి చేతిలో పడితే అది ఎన్నో రూపాలు సంతరించుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి చేతిలో పడటం రాజేంద్ర ప్రసాద్ అదృష్టం. ఆయనే హాస్య బ్రహ్మ జంధ్యాల. జంధ్యాల రూపొందించిన రెండురెళ్లు ఆరుతో మొదలు పెట్టి వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నవ్వులతో కన్నీళ్లు పెట్టించాయి.. నవ్వలేక వచ్చే కడుపునొప్పి టాబ్లెట్ల గిరాకీని పెంచాయి. జంధ్యాల మార్క్ టైమింగ్ కామెడీకి రాజేంద్ర ప్రసాద్ లాంటి ఆర్టిస్ట్ ఎంత యాప్ట్ అవుతాడో వేరే చెప్పాలా.. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హాస్యపు జల్లుల్లో తడిపేసింది. ఈ ఇద్దరూ సినిమా చేస్తున్నారని తెలిస్తే చాలు.. జయమ్ము నిశ్చయమ్మురా అని బాక్సాఫీస్ కూడా ఫిక్స్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు.

తెలుగులో యంగ్ హీరో క్యారెక్టర్స్ ను యంగ్ ఆర్టిస్టులే చేయాలి అనే ట్రెండ్ క్రియేట్ చేసింది జంధ్యాల. ఆ ట్రెండ్ ను కామెడీవైపు తీసుకువెళ్లి కంటిన్యూ చేశారు వంశీ, ఇవివి సత్యనారాయణ, రేలంగి నర్సింహారావు, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శక దిగ్గజాలు. అదృష్టవశాత్తూ ఈ అందరు దర్శకులూ రాజేంద్రప్రసాద్ తో సినిమాలు చేశారు. ఇంకా లక్ ఏంటంటే.. వీళ్లందరిదీ కామెడీ పంచడంలోనూ కథలు చెప్పడంలోనూ డిఫరెంట్ స్టైల్.. ఆ అందరి స్టైల్స్ నూ అందిపుచ్చుకుని అదరగొట్టేశాడీ మాయలోడు. చాలామంది రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేసిన ఎర్రమందారం అతనిలోని నటుడ్ని గొప్పగా ఆవిష్కరించిందని చెబుతారు. కానీ అంతకు ముందే వచ్చిన ప్రేమతపస్సులోనే అతని నట విశ్వరూపం కనిపిస్తుంది. రోజా హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమాలో అతని నటన చూసి తీరాల్సిందే.

జంధ్యాల స్కూల్ నుండి వచ్చిన ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం లో అంతకుముందే చెవిలోపువ్వు చేశాడు రాజేంద్ర ప్రసాద్. కానీ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు.కమర్షియల్ గానే కాదు నవ్వులు పంచడంలోనూ ఫెయిల్ అయింది. ఈ ఫ్లాప్ తరువాత వచ్చిన చిత్రాలు, ఆ…ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు. కొంత డబుల్ మీనింగ్ డైలాగున్నా.. ఇది ‘నామార్కు హాస్యం’అని ఇ.వి.వి. డిసైడ్ చేస్తే, దాన్నికూడా తన టైమింగ్ తో సంసారపక్షం చేసిన నటుడు రాజేంద్రప్రసాద్. ఓ దశలో రాజేంద్రుడి కామెడీ బోర్ కొడుతుందా అన్న టైమ్ లో మరో దర్శకుడు తెరమీదికి వచ్చి, రాజేద్రుడి ఆరోగ్యకరమైన హాస్యనటనని తన నూతన ఒరవడితో మరో మలుపు తిప్పాడు. ఆ దర్శకుడే ఎస్.వి.కిష్ణారెడ్డి. రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో అప్పటివరకూ కొంత ఓవర్ యాక్టింగ్ వైపు మొగ్గుచూపిన రాజేంద్రుడు మళ్ళీ సహజ నటనను అండర్ ప్లే గా మలచి.. తనకే సొంతమైన లాఫింగ్ మ్యాజిక్ తో మెస్మరైజ్ చేశాడు.

ఇక రాజేంద్రుడిలోని మరో యాంగిల్ ను చూపించిన దర్శక దిగ్గజం బాపు. స్నేహం తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం లాంటి సినిమాలు ఇప్పటికీ ఫ్రెష్ గానే కనిపిస్తాయి. మిస్టర్ పెళ్లాంలో సోషియల్ సెటైర్ నూ కామెడీగా పండించిన సీన్స్ ఇంకెవరు చేసినా అంత పండేవి కావు. అలాగే పెళ్లి పుస్తకం కూడా. హాస్యం అపహాస్యం కాకుండా.. ఒక్కోసారి అపహాస్యాన్నీ పండించినా.. అసహ్యాన్ని కలిగించని నటుడు రాజేంద్రప్రసాద్. కమెడియన్ కు మంచి టైమింగ్ ఉండాలి. కానీ రాజేంద్రుడిది లేట్ టైమింగ్. అది చాప్లిన్ నుంచి నేర్చుకున్నాడో, రాజబాబు ను మరిపించాలని ప్రయత్నించాడో కానీ.. ఈ టెక్నిక్ ను రాజేంద్రప్రసాద్ తర్వాత ఇంకెవరూ ఆ టైమింగ్ ను అందుకోలేకపోయారు. ఆ టైమింగ్ అతనికే సొంతం.. అందుకే కామెడీ హీరోగా అంత టైమ్ నవ్వించగలిగాడు. దర్శకుడిగా మేడమ్ లాంటి ప్రయోగాత్మక సినిమాతో శెభాష్ అనిపించుకున్నాడు.. నిర్మాతగా రాంబంటు లాంటి చిత్రంతో అభిరుచినీ చాటుకుని, అద్భుతమైన నటన చూపించాడు. అదే టైమ్ లో కొత్తగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా అందరు తారలతో కలిసి ఆరోగ్యకరమైన హాస్యాన్ని పంచాడు. ఎన్ని చేసినా మనకు రాజేంద్రప్రసాద్ అంటే కామెడీ హీరో.. కామెడీకి హీరో.. అంతే.

ఏ జర్నీకైనా దిగాల్సిన స్టేజ్ ఒకటి వస్తుంది. అక్కడి నుండి మరో వాహనం చూసుకుంటామా లేదా ఇంటికే వెళతామా అనేది మనమే నిర్ణయించుకుంటాం. అలా రాజేంద్రుడు కూడా ఆ నలుగురుతో హీరో అనే స్టేజ్ నుంచి దిగేసి మరో బస్ ఎక్కాడు. ఆ సినిమాతో మరో సారి తానెంత వాల్యుబుల్ ఆర్టిస్టునో కూడా చూపించాడు. తర్వాత మంచిపాత్రలకు శ్రేయోభిలాషిగా మారిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త టర్న్ తీసుకుని ఆల్ రౌండర్ గా అదరగొడుతున్నాడు. నిస్సందేహంగా రాజేంద్రప్రసాద్ మనకు మాత్రమే దొరికిన హాస్య ముత్యం.. తెలుగు సినిమా హాస్యాన్ని ఆరు మెట్లు ఎక్కించిన ది గ్రేట్ కామెడీ హీరో. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ గ్రేడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డిమాండ్ లో ఉన్నాడు. ఏ పాత్ర చేసినా అందులో తన మార్క్ చూపించడం రాజేంద్రుడి శైలి. ఆ శైలిని మెచ్యూర్డ్ గా పండిస్తాడు. అందుకే దర్శకులు కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ పాత్రలు రాసుకుంటున్నారు. అందుకు లేటెస్ట్ గా వచ్చిన ఓ బేబీ మరో ఎగ్జాంపుల్. సో.. రాజేంద్రుడు ఇలాగే దర్శకుల నటుడుగా ఉంటూ ప్రేక్షకుల్ని మరి కొంత కాలం పాటు తన నవ్వుల్లో, నటనతో అలరించాలని కోరుకుంటూ ఆల్ రౌండర్ రాజేంద్ర ప్రసాద్ కు మరోసారి హ్యాపీ బర్త్ డే చెప్పేద్దాం. నవ్వలేకపోయిన రోగులకు మందిచ్చి డాక్టర్ గా.. నవ్వించడమనే భోగాన్ని కలిగించిన కామెడీ హీరోగా రాజేంద్రుడు ఇలాగే నవ్వుతూ యోగిలా ఉండాలని కోరుకుందాం.

Next Story

RELATED STORIES