మండలిలో లోకేష్‌ స్పీచ్‌.. అధికారపక్ష సభ్యుల ఆశ్చర్యం

మండలిలో లోకేష్‌ స్పీచ్‌.. అధికారపక్ష సభ్యుల ఆశ్చర్యం

లోకేష్‌ వాయిస్‌ పెంచారు.. లోకేష్‌ దూకుడు చూపిస్తున్నారు.. లోకేష్‌ అధికార పార్టీని రప్ఫాడించేస్తున్నారు.. లోకేష్‌ ప్రభుత్వానికి ముచ్చెటమలు పట్టిస్తున్నారు.. అవును, టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చంతా ఇప్పుడు లోకేష్‌పైనే.. గత నెలరోజులుగా లోకేష్‌ విశ్వరూపాన్ని చూస్తున్న తమ్ముళ్లు తెగ ఖుషీ అవుతున్నారు. అధికారపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో లోకేష్‌ దూకుడు చూసి హుషారవుతున్నారు. లోకేష్‌ దూకుడుతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది.

అధికారంలో ఉంటే ప్రభుత్వ విధానాల మేరకు నడుచుకోవాలి.. ప్రతిపక్షంలో ఉంటే తమను తాము నిరూపించుకోవాలి.. లోకేష్‌ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని లోకేష్‌ మళ్లీ యాక్టివేట్‌ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు మాట్లాడటం కూడా రాదని విమర్శలు చేసిన వారంతా లోకేష్‌ దూకుడును చూసి నోరెళ్లబెడుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు.. తాజాగా మండలిలో లోకేష్‌ స్పీచ్‌ని చూసి అధికార పక్ష సభ్యులే ఆశ్చర్య పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నిధుల మళ్లింపు వ్యవహారంపై చర్చ సందర్భంగా అధికార పక్షాన్ని టార్గెట్‌ చేస్తూ లోకేష్‌ విశ్వ రూపం చూపించారు. మంత్రులు అనిల్‌, సురేష్‌ చేసిన నిధుల ఆరోపణలపై ఊహించని విధంగా లోకేష్‌ రియాక్ట్‌ అయ్యారు. తనపై ఆరోపణలు చేసే ముందు సభలో సాక్ష్యాలు ప్రవేశపెట్టాలని సవాల్‌ విసిరారు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చదుకున్న తాను తెలుగుతో తప్పులు మాట్లాడి ఉండవచ్చు కానీ.. తప్పుడు పనులు చేయలేదన్నారు. సీఎం జగన్‌లా తప్పులు చేసి జైలుకు వెళ్లలేదంటూ కౌంటర్లు ఇచ్చారు. మండలిలో నిధుల మళ్లింపు వ్యవహారంపై జరిగిన చర్చలో రచ్చను పక్కనబెడితే.. లోకేష్‌ తన వాదనను ధైర్యంగా, గట్టిగా వినిపించడం గొప్పవిషయమనే చెప్పాలి. మండలిలో లోకేష్‌ కోపాన్ని చూసి టీడీపీ నేతలంతా షాకవుతున్నారు.. గతంలో ఇలాంటి లోకేష్‌ను తాము ఎప్పుడు చూడలేదని చర్చించుకుంటున్నారు.. ఆయన చాలా పరిణితి చెందినట్లుగా చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులోనూ లోకేష్ ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వంపై తన మాటల దాడిని కొనసాగించాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారు.

గతంలో పరిస్థితి ఎలా ఉన్నా, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన డే వన్‌ నుంచే లోకేష్‌ టార్గెట్‌ చేయడం మొదలు పెట్టారు.. కేవలం నెలరోజుల్లోనే తన విశ్వరూపం చూపించారు. మునుపటి కంటే పూర్తిగా మారిపోయి అవకాశాలను అందిపుచ్చుకుంటూ వైసీపీ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ ట్వీట్ల తుఫాన్లతో విరుచుకుపడుతున్నారు.. అటు నుంచి రెండు విమర్శలొస్తే.. లోకేష్‌ నుంచి వెంటనే కౌంటర్‌ ట్వీట్లు పడిపోతున్నాయి. ఆరోపణలకు ట్విట్టర్‌ వేదికగా కౌంటర్లు ఇస్తూ వాటికి వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు జోడిస్తూ దూకుడంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. అంతేకాదు, ట్వీట్లతో ఆగిపోకుండా ప్రజా సమస్యలను సందర్భోచితంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇటీవల శాసనమండలిలో లోకేష్‌ మాట్లాడుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

మొత్తంగా ఒకప్పటి లోకేష్‌ వేరు.. ఇప్పుడు లోకేష్‌ వేరనే విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు.. ప్రస్తుతం అధినేత చంద్రబాబు మినహా అధికార పార్టీ విమర్శలను ఆ స్థాయిలో తిప్పికొట్టగలిగే నేతలు ఒకరిద్దరు తప్ప టీడీపీలో ఎవరూ లేరు.. ఇప్పుడు లోకేష్‌ దూకుడుతో కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.. రాటు దేలిన లోకేష్‌ను చూసి పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తాయని చర్చించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story