కనులైనా తెరవని ఆ పసిగుడ్డు కాలువలో..

కనులైనా తెరవని ఆ పసిగుడ్డు కాలువలో..

భారంగానే 9 నెలలు మోసింది.. బిడ్డ భూమ్మీద పడగానే వద్దనుకుంది కాబోలు.. ప్లాస్టిక్ కవర్లో చుట్టి కాలువలోకి విసిరేసింది. ఆ బిడ్డకు భూమ్మీద నూకలున్నాయేమో ఆ దృశ్యం శునకాల కంట పడింది. కాలువలో పడిన మూటని బయటకు తీసుకువచ్చాయి. హరియాణాలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శుక్రవారం ఓ మహిళ డ్రోగన్ గేట్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురికి కాల్వలోకి విసిరేసి వెళ్లి పోయింది. అటుగా వెళుతున్న కుక్కలు ఆ కవర్‌ని బయటకు తీసుకువచ్చి అరవడం మొదలు పెట్టాయి. చుట్టుపక్కల స్థానికులకు అనుమానం రావడంతో కవర్ ఓపెన్ చేసి చూశారు. పసిబిడ్డ ప్రాణాలతోనే వుందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బిడ్డను అత్యవసర చికిత్సకై ఆసుపత్రికి తరలించారు. బిడ్డ తలకు బలమైన గాయమైందని త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. కనీస కనికరమైనా లేకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మహిళ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story