బాధితులను పరామర్శించే వరకు ఇక్కడి నుంచి వెళ్లను - ప్రియాంక

బాధితులను పరామర్శించే వరకు ఇక్కడి నుంచి వెళ్లను - ప్రియాంక
X

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్టు వీడడం లేదు. నిన్న మధ్యాహ్నం చేపట్టిన ధర్నాను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రంతా విద్యుత్‌ లేకున్నా ధర్నా చేశారు. బాధితులను పరామర్శించే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు. ఆమెకు మద్దతుగా స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకను నిన్న మీర్జాపూర్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే నిరసనకు దిగారామె. పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకుని చునార్‌లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. దీంతో నిన్నటి నుంచి అక్కడే ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రియాంక.

భూమి విషయంలో 10 మంది అమాయక గిరిజనులను చంపేశారని.. వారిని పరామర్శించడం బాధ్యత అన్నారు ప్రియాంక. తాను నేరస్తురాలిని కాదని.. దౌర్జన్యం చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారామె. ప్రియాంక అరెస్ట్‌ను రాహుల్‌ గాంధీ ఖండించారు. ప్రియాంకను అక్రమంగా అరెస్ట్‌ చేశారని..ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఉన్న అభద్రతా భావానికి ఇదే నిదర్శనమని ట్వీట్‌ చేశారు రాహుల్‌.

Next Story

RELATED STORIES