అక్కడ నేటి నుంచి అతి భారీ వర్షాలు..

అక్కడ నేటి నుంచి అతి భారీ వర్షాలు..

మూడు రోజులుగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఊహించని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.. వర్షాలకు కొల్లాం, తిరువళ్లలో ఇద్దరు మృతిచెందారు.. దీంతో కసర్‌గఢ్‌ జిల్లాలో అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. జిల్లాలోని కరియన్‌ గోడ్‌ నది పొంగి పొర్లుతోంది.. దీంతో దిగువ ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి.. వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక జిల్లాలో విద్యా సంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు.

ఇడుక్కి జిల్లాలోని కొన్నాతడై గ్రామంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో దిగువన వున్న పంటలు దెబ్బతిన్నాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇడుక్కి డ్యామ్‌తోపాటు పాంబ్లా, ముల్లపెరియార్‌, తోడుపుజ్జాలోని మలంకారా, తిరువనంతపురంలోని అరువికర, త్రూసర్‌లోని పెరింగళ్‌కుత్తు డ్యామ్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. కోజికోడ్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వయనాడ్‌, ముళప్పురం, కణ్ణూర్‌, ఇడుక్కి, పత్తనంతిట్ట ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి.. పలు ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు కోజికోడ్‌, వయనాడ్‌లో నేటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తిరువనంతపురం, కొల్లాం, పత్తనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌, పాలక్కడ్‌ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ ప్రకటించగా, ఇడుక్కి, కోజికోడ్‌, వయనాడ్‌, మల్లప్పురం, కన్నూర్‌లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. అటు సహాయక చర్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

దక్షిణాదితోపాటు ఉత్తర భారతాన్ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. కర్ణాటక, కేరళ, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, అసోంలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలను జలదిగ్బంధం చేశాయి.. అసోంలో ఇప్పటికీ వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story