షీలా దీక్షిత్‌ పార్థివ దేహానికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ, సోనియా గాంధీ

షీలా దీక్షిత్‌ పార్థివ దేహానికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ, సోనియా గాంధీ
X

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎస్కార్ట్స్ హాస్పిటల్‌లో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నిలకడగా గుండె కొట్టుకోకపోవడంతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వెంటనే వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్యం ఇంకాస్త విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

షీలా దీక్షిత్ వయస్సు 81 ఏళ్లు. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 2014 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమె మృతికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.

షీలా దీక్షిత్‌కు పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఆమె నివాసానికి వెళ్లిన నేతలు.. షీలా పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీకి కొత్త రూపు తెచ్చారని ప్రముఖులంతా ఆమె పాలనను గుర్తుకు తెచ్చుకున్నారు..

షీలా నివాసానికి చేరుకున్న వివిధ పార్టీల నేతలంతా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, బీజేపీ నేత విజయ్‌ గోయల్‌, కాంగ్రెస్‌ నేత జ్యోతిరాధిత్య సింథియా తదితరులు ఆమె భౌతికకాయనికి నివాళులర్పించారు.

ఏపీ సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖ నేతలంతా షీలా మృతిపై ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ అభిమాన నేత మరణవార్తతో షాక్‌కు గురైన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు ఒక్కొక్కరుగా శనివారం నిజాముద్దీన్‌లోని షీలా నివాసం దగ్గరకు భారీగా చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో ఎంతగానో కృషిచేసిన షీలా మృతి పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశాయి పార్టీ శ్రేణులు.

మరి కొన్ని గంటల వరకు ఆమె మృత దేహాన్ని నిజాముద్దీన్‌లోనే ఉంచనున్నారు. తరువాత అక్కడి నుంచి మధ్యాహ్నానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్తారు. అక్కడ పార్టీ నేతలు నివాళి అర్పించిన తర్వాత అంతిమ యాత్ర నిర్వహించి.. నిగమ్ బోధ్ ఘాట్‌లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో షీలా దీక్షిత్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story

RELATED STORIES