ఏపీలో నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు

ఏపీలో  నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు

నెల్లూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపివేయడంతో వేలాదిగా భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో.. వాటిపై ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉన్న నెల్లూరులో ఇసుక అందుబాటులో ఉండి కూడ వినియోగంలో లేకపోవడంతో సాధారణ ప్రజలతో పాటు భవననిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యయ ప్రయాసలతో కూడుకున్న భవన నిర్మాణాలు అర్దాంతరంగా నిలిచిపోవడంతో భారీగా నష్టం వాటిల్లుతోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, బేల్దారీ పనులపై ఆధారపడి జీవిస్తున్నవారు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా. కేవలం నెల్లూరు నగరంలోనే 35 వేల మంది వరకు ఉంటారు. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, చెన్నై, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి అద్దె ఇళ్లల్లో ఉంటూ.. బేల్దారీ పనులు చేసుకుంటూ జీవించేవారు సుమారు 10 వేల మంది వరకు ఉన్నారు. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, నెల్లూరు గ్రామీణం, అల్లీపురం, కోడూరుపాడు, ఇనమడుగు, కొత్తూరు, బుజబుజనెల్లూరు, ముత్తుకూరు, బ్రహ్మదేవం తదితర ప్రాంతాల్లోని కూలీలంతా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే నగరానికి చేరుకుంటారు. నగరంలోని తడికలబజారు సెంటర్‌, కోటమిట్ట, జెండావీధి, ముత్తుకూరు గేటు, కొండాయపాళెంగేటు, కరెంట్‌ ఆఫీసు సెంటర్‌, పద్మావతి సెంటర్‌, ఎంజీబీ ప్రాంతాలతోపాటు కొత్తహాలు సెంటర్లకు వచ్చి పని కోసం ఎదురు చూస్తారు. వీరికి మేస్త్రీలంటూ ఎవరూ ఉండరు. ప్రతి రోజూ ఎవరైనా భవన నిర్మాణ పనులకు అవసరమైన వారు, ఇతర మేస్త్రీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు వారిని పనులకు తీసుకెళుతుంటారు. ఇలా గత 20, 30 ఏళ్లుగా ఆయా సెంటర్లే ఆ కూలీలకు అడ్డాలు.

అయితే.. గత నెల రోజులకుపైగా జిల్లాలో ఇసుక రవాణా ఆగిపోవడంతో.. ప్రస్తుతం వీరంతా రోజు కూలీ పనుల కోసం గంటల తరబడి రోడ్లపై ఆయా ప్రాంతాల్లో పడిగాపులు కాస్తున్నారు. రోజు వారీ కూలీ డబ్బులతోనే వారు కుటుంబాన్ని పోషించుకుంటారు. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె, కొండెక్కిన నిత్యావసర సరకులు, కూరగాయలు కొనాలి. ఇది విద్యాసంవత్సరం కనుక.. పిల్లలకు పుస్తకాలు, కొత్త దుస్తులు, యూనిఫారాలతో పాటు అడ్డు, అదుపూ లేని స్కూల్‌ ఫీజులూ చెల్లించాలి. ఏ రోజుకారోజు పనికెళితే తప్ఫ. పూట గడవని పరిస్థితి వీరిది.

రాష్ట్రంలో.. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇసుక విక్రయ విధానంపై దృష్టి సారించింది. నూతన విధానం అమల్లోకి వచ్చే వరకు రేవుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై దాని ప్రభావం పడడంతో చేపట్టిన నిర్మాణాలు శ్లాబు దశల్లోనే నిలిచిపోయాయి. దీంతో.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సెప్టెంబరు 5వ తేదీన ఇసుక నూతన విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని..., అప్పటి వరకు ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నెల రోజులకు పైగా జిల్లాలో ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో.. దీనిపై ఆధారపడ్డ వారి పరిస్థితి దయనీయంగా మారింది.

మరోవైపు.. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.. జిల్లాలోని ఇసుక రేవుల నుంచి కొందరు అక్రమ మార్గాన ఇసుకను తీసుకొచ్చి ఓ ఎడ్లబండి ఇసుకను 2 నుంచి 3 వేలకు విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టరు ఇసుకైతే ఏకంగా వినియోగదారుడి అవసరాన్నిబట్టి 4 నుంచి 6 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో.. ఈ పరిస్థితి ఉండేది కాదు. రేవుల్లో సులువుగా అతి తక్కువ మొత్తానికే ఇసుక దొరికేది. ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విదించడంతో.. జిల్లాలో ఇసుకకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ అవకాశాన్ని ఇసుక మాఫియా అందిపుచ్చుకుంది. దొంగచాటుగా ఇసుకను తరలిస్తూ.. అదిక రేఠ్లకు విక్రయిస్తుండటంతో.. ఆ భారం నిర్మాణ వ్యయంపై పడుతోందని సొంత నివాసాలు నిర్మించుకునేవారు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story