ఇస్రో ఘనత.. విజయవంతమైన చంద్రయాన్‌-2 ప్రయోగం

ఇస్రో ఘనత..  విజయవంతమైన చంద్రయాన్‌-2 ప్రయోగం

చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతం అయింది... భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. మొత్తం 48 రోజులు పాటు సాగనున్న ఈ మిషన్‌... సెప్టెంబర్‌ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై దిగడంతో పూర్తవుతుంది. ఇదే జరిగితే.. చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిషన్‌ మొత్తం 48 రోజులు సాగనుంది. భూకేంద్రం నుంచి చంద్రయాన్-2 మాడ్యూల్‌లోని ద్రవ ఇంధనాన్ని పలుమార్లు మండిస్తూ, కక్ష్యలను మారుస్తూ చంద్రుడివైపు పయనింపచేస్తారు. యాత్ర 23వ రోజు కక్ష్యను మారుస్తారు. అనంతరం ఆర్బిటర్ సంచరించే కక్ష్యను చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు. 48వ రోజున అంటే, సెప్టెంబర్ 7న ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది......

జాబిలిపై దిగిన వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. ల్యాండర్ దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో రోవర్ సంచరిస్తూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది... చంద్రయాన్-2లో మూడు ముఖ్య పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది. అలా దిగిన తర్వాత రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ సాగిస్తుంది. ఈ రోవర్ తను గుర్తించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ల్యాండర్ ఆ సమాచారాన్ని ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ భూమికి పంపిస్తుంది.

చంద్రయాన్ -2 బరువు 3,850 కిలోలు. వాహకనౌకలో ఇస్రో 13 పరిశోధనా పరికరాలు అమర్చింది. అవి చంద్రుడి దక్షిణ ధృవానికి అతి సమీపంగా వెళ్లనున్నాయి. ఇంతకుముందు దిగిన మిషన్లన్నీ.. చంద్రుడి మధ్యరేఖ మీదే ల్యాండ్‌ య్యాయి. ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి దక్షిణధృవాన్ని చేరలేదు. కాబట్టి చంద్రయాన్-2 ద్వారా కొత్త సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష వాహనాన్ని సాఫ్ట్‌ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది..

Tags

Read MoreRead Less
Next Story