దొంగతనం చేసేందుకు పక్కాగా ప్లాన్ ఇచ్చిన కానిస్టేబుల్.. చివరకు..

మంచి ఉద్యోగం ఉన్నా డబ్బుమీద అత్యాశతో అడ్డదారితొక్కి చివరకు కటకటాలపాలయిన ఓ కానిస్టేబుల్ ఉదంతం కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. బంగారం దొంగతనంలో దొంగల ముఠాకు సహరించాడని రుజువు కావడంతో ప్రొద్దుటూరులోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో పనిచేస్తోన్న కానిస్టేబుల్ సుబ్బారాయుడును రేణిగుంట రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
గతనెల 11న చిత్తూరు జిల్లా పాకాల సమీపంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోన్న నగల వ్యాపారి ముకుందరాజన్‌ను బెదిరించి కొందరు దుండగులు 1080 గ్రాముల బంగారాన్నిదోచుకెళ్లారు. ప్రొద్దుటూరుకు చెందిన బంగారు నగల వ్యాపారి నక్కా రాజశేఖర్,యర్రగుంట్లకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమాని ప్రసాద్, మైలవరం మండలం నక్కోనిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి పుల్లా రెడ్డి కలసి నగల దొంగతనానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. అయితే.. ఈ ముగ్గురికి దొంగతనం ఎలా చేయాలో తర్ఫీదు ఇచ్చింది మాత్రం కానిస్టేబుల్ సుబ్బారాయుడేనని విచారణలో నిందితులు పోలీసుల ముందు వెల్లడించారు. ఈ ముగ్గురు నిందితులు పోలీసుల వేషధారణలో వెళ్లి రైలులో ప్రయాణిస్తోన్న నగల వ్యాపారి ముకుందరాజన్‌ను బెదిరించి అతని వద్ద ఉన్నబంగారాన్ని గుంజుకున్నారు. ముకుందరాజన్‌నుంచి ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు ఈ నెల 16 న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు దొంగతనం చేసేందుకు పక్కాగా ప్లాన్ రచించి అమలు చేసిన కానిస్టేబుల్ సుబ్బారాయుడును కూడ శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com