Top

ఆటిజంతో బాధపడుతున్నా మోడల్‌గా ఎదిగిన ప్రణవ్..

ఆటిజంతో బాధపడుతున్నా మోడల్‌గా ఎదిగిన ప్రణవ్..
X

మనసులో కోరిక బలంగా ఉంటే మానసిక వైకల్యం కూడా అడ్డు కాదని నిరూపిస్తున్నాడు డెహ్రడూన్‌కు చెందిన ప్రణవ్ బక్షి. అందరి పిల్లల్లా అల్లరి చేయలేరు ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు. అమ్మ పిలిచినా పలకరు. ఒకవేళ పలికినా చెప్పింది వినరు. మాటలు కూడా సరిగా రావు. పాతికేళ్లు వచ్చినా పసిపిల్లల్లానే ఉంటారు వాళ్లు. ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్న బక్షికి మరో సమస్య కూడా ఉంది. అదే ఎకోలలియా. అంటే చెప్పిన మాటనే పదే పదే చెబుతుంటాడు. ఇన్ని సమస్యలున్నా మనసు అంతరాళాల్లో ఏదో తెలియని కోరికకు బీజం పడింది.

ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లాడిని చూసి పొత్తిళ్లలో పొదువుకుంది తల్లి అనుపమ. రెండేళ్లు వచ్చినా ఉలుకూ, పలుకు లేదు. అమ్మా అనే పిలుపు కోసం ఆత్రంగా ఎదురు చూసింది. లాభం లేదని హాస్పిటల్‌లు తీసుకువెళితే మానసిక ఎదుగుదలలో లోపం అని చెప్పారు డాక్టర్లు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని కుమారుడికి కనిపించనివ్వలేదు. అప్పటినుంచి ప్రణవ్‌కి అన్నీ తానై నిలిచింది. ప్రత్యేక పాఠశాలలో చదివించేది. ప్రతీది వివరించి చెప్పేది.

ప్రణవ్‌కి పదహారేళ్ల వయసున్నప్పుడు ఒక షాపింగ్ మాల్‌కి తీసుకు వెళ్లింది. మాల్ యాజమాన్యం ర్యాంప్ వాక్ ఏర్పాటు చేసింది. ఉత్సాహ వంతులైన యువతీ యువకులు అందులో పాల్గొంటున్నారు. అది చూసిన బక్షి.. తల్లితో తానూ వెళతానన్నాడు. అమ్మకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. వెంటనే కొడుకుని ర్యాంప్ వాక్‌పైకి పంపింది. చూట్టూ ఉన్న వారు చప్పట్లు కొడుతుంటే ప్రణవ్ స్టైల్‌గా ర్యాంప్‌పై వాక్ చేశాడు. అమ్మ ఆనందంతో అదంతా వీడియో తీసింది. ఇంటికి వచ్చిన తరువాత పదే పదే ఆ వీడియోని చూసి మురిసి పోతున్నాడు. మాటల్లో బయటకు చెప్పలేకపోయినా కొడుకు మనసులోని కోరికను గ్రహించింది తల్లి. అప్పుడే నిర్ణయించుకుంది కొడుకుని మోడల్ చేయాలని. అప్పటి నుంచి కనిపించిన ప్రతి మోడలింగ్ ఏజెన్సీకి కొడుకు పరిస్థితిని వివరిస్తూ మోడల్‌గా అవకాశం ఇమ్మని కోరింది. కొన్ని ఏజెన్సీలు సమాధానం కూడా ఇవ్వలేదు. మరి కొన్ని ఏజెన్సీలు ఇప్పుడేమీ అవకాశాలు లేవని రిప్లై ఇచ్చారు. అయినా అనుపమ నిరాశ చెందలేదు. మరికొన్ని సంస్థలను సంప్రదించింది.

చివరికి ఆమె ప్రయత్నం ఫలించి మోడల్ నీంజా సింగ్‌ నుంచి కాల్ వచ్చింది. దిల్లీలో నింజా మోడల్ మేనేజ్‌మెంట్ సంస్థని నడుపుతోంది. ఆమె కాల్‌తో తల్లీకొడుకులిద్దరూ దిల్లీ బయలు దేరారు. అక్కడ అనేక ఫోటో షూట్లు చేశాక ప్రణవ్‌కి మోడల్‌గా అవకాశం ఇచ్చింది నీంజా. ఆమె ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు మోడళ్లను అందిస్తుంది. ప్రణవ్‌తో యూఎస్ పోలో, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ వంటి బ్రాండెడ్ దుస్తుల మోడలింగ్‌ను చేయించింది. అక్కడ పేరున్న పెద్ద పెద్ద మోడళ్లతో సమానంగా తన కొడుకు నడుస్తుంటే తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇప్పుడు ప్రణవ్ ర్యాంప్ వాక్‌తో, ఫోటో షూట్‌లతో బిజీగా ఉన్నాడు. సూపర్ మోడల్ కావాలని ప్రణవ్ కలలు కంటున్నాడు. కొడుకు కలను నిజం చేయడం కోసం కుటుంబం డెహ్రడూన్ నుంచి దిల్లీకి మకాం మార్చింది. అమ్మ తోడుగా అడుగులు ముందుకు వేస్తున్నాడు ప్రణవ్. ఆస్ట్రేలియాకు చెందిన మేడెలిన్ స్టువర్ట్ అనే సూపర్ మోడల్‌కు డౌన్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వుంది. అయినా ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌, ప్యారిస్ ఫ్యాషన్ వీక్, లండన్ ఫ్యాషన్ వీక్.. ఇలా చాలా షోలలో ర్యాంప్ వాక్ చేస్తోంది. ప్రణవ్ సెలక్ట్ చేయడానికి కారణమం ఆమే అని వివరించింది నీంజా. అయితే ప్రణవ్ నీంజా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మోడల్‌గా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నాడు.

Next Story

RELATED STORIES