కూతురుపై దాడికి పాల్పడ్డ కన్నతల్లి..

కూతురుపై దాడికి పాల్పడ్డ కన్నతల్లి..

తల్లే తన ప్రాణాలకు ముప్పని ఆ కూతురు ఊహించి ఉండదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లే కన్న కూతుర్ని చంపేసేందుకు ప్రయత్నించింది. కూతురుపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నక్కబండ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. తల్లి యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కూతురు చల్లమ్మ తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వృద్ధాప్యంలో తనను వదిలివెళ్లిపోతోందన్న కోపంతోనే కూతురిపై దాడికి తెగబడింది ఆ తల్లి. చల్లమ్మ భర్త ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి చల్లమ్మ.. తన తల్లి లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి తల్లి, కూతుళ్ల మధ్య ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి నుంచి దూరంగా వెళ్లాలని చల్లమ్మ నిర్ణయించుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన తల్లి లక్ష్మమ్మ.. కూతురిపై యాసిడ్ దాడి చేసింది.

అంతే కాదు దాడిని ఆ తల్లి సమర్థించుకునే ప్రయత్నం చేసింది. కన్న కూతురిపైనే ఇంతటి దారుణానికి ఒడిగడతావా అంటు స్థానికులు ప్రశ్నిస్తే.. వారిపై ఎదురు దాడికి దిగింది లక్ష్మమ్మ. నా కూతురు నా ఇష్టం అంటూ ఎదురు సమాధానం ఇచ్చింది. అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులతో కూడా లక్ష్మమ్మ వాగ్వాదానికి దిగింది. నాకూతురు నా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటాను అడగటానికి మీరెవరు? అంటు ప్రశ్నించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మమ్మకు యాసిడ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ కొనుగోలు చేసింది అని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధాప్యంలో బిడ్డ తోడు ఉండడకుండా వెళ్లిపోవడం తప్పే. అంత మాత్రాన కన్నకూతురిని చంపేసేందుకు ప్రయత్నిస్తారా? ఎంతో భవిష్యత్‌ ఉన్న కూతురిని యాసిడ్‌ దాడితో అంధకారం చేస్తారా? రక్షణగా ఉండాల్సిన ఆ తల్లే ఇంత దారుణానికి ఒడిగడితే ఎవరికి చెప్పుకోవాలనే ప్రశ్న వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story