చంద్రయాన్‌ 2.. జాబిల్లిపై నీటి జాడను అన్వేషించే పరికరాలు ఇవే..!

చంద్రయాన్‌ 2.. జాబిల్లిపై నీటి జాడను అన్వేషించే పరికరాలు ఇవే..!

చంద్రయాన్‌ -2 ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ...తన కార్యాలయంలో చంద్రయాన్‌ ప్రయోగాన్ని వీక్షించారు. సక్సెస్‌ అనంతరం.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

జాబిల్లిపై మిషన్‌ను పంపడం ఓ అద్భుత ఘనత. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే దాన్ని సాధించగలిగాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి చంద్రయాన్‌-2 తన గమ్యాన్ని చేరుకోగలిగితే.. త్వరలో భారత్‌ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంటుంది. అంతేకాదు.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డుల్లోకి ఎక్కనుంది.

చంద్రునిపైకి వ్యోమనౌకను చేర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకోసం అనేక సవాళ్లు, సాంకేతిక ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. దిగిన తర్వాతా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఇలాంటివి అన్ని అధిగమిస్తేనే పూర్తి విజయం సాధించినట్లు. ముఖ్యంగా ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధృవంలో ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన ప్రక్రియ. చంద్రునిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఆర్బిటల్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయాక 15 నిమిషాలు అత్యంత కీలకం. రోవర్‌ సెకెన్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే పనిచేస్తుంది. ఒక లూనార్‌ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది.

చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లలో పరిశోధనల కోసం 13 పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ దేశీయంగా రూపొందించినవే. ఈ ఉపకరణాలు ప్రధానంగా జాబిల్లిపై నీటి జాడను అన్వేషిస్తాయి. ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటాతోపాటు అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును విశ్లేషిస్తాయి. త్రీడీ మ్యాప్‌లను రూపొందిస్తాయి. భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగపడే డేటాను అందిస్తాయి.

అంతరిక్ష యాత్రల్లో.. గమ్యం చేరగానే నిదానంగా, క్షేమంగా దిగటమన్నది పెద్ద సవాల్‌. అందుకే చంద్రయాన్‌-2ను నెమ్మదిగా జాబిల్లి మీద దించటమెలాగన్న దానిపై ఇస్రో చాలాకాలం పాటు భారీఎత్తున కసరత్తులు చేసింది. ముఖ్యంగా ల్యాండింగ్‌ ప్రక్రియపై పట్టుకోసం.. జాబిల్లి మీద నెలకొన్న ప్రత్యేక పరిస్థితులన్నింటినీ భూమ్మీదే సృష్టించి.. ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌పై విస్తృతంగా పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాతే ప్రయోగానికి శ్రీకారానికి చుట్టింది.

Tags

Read MoreRead Less
Next Story