మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. పొత్తులు రాజకీయ ఎత్తులతో పార్టీలు వ్యూహారచన చేస్తున్నాయి. అయితే బీజేపీ, శివసేనతోపాటు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థిని మార్చనున్నట్లు ఊహాగానాలు రావడంతోపాటు అటు ఈసారి శివసేనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని కొందరు జోస్యం చెబుతున్నారు. అయితే ఈ విశ్లేషణలకు, జోస్యాలకు తెరదింపుతూ మరోసారి తానే సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ఓ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే బరిలోకి దిగుతాయన్నారు. తమకు తోడుగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ సమాజ్ పక్షా లాంటి పార్టీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు రావడంతో ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. అయితే బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడంతో శివసేన దిగిరాక తప్పలేదు. అనంతరం ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి కలిసి పోటీ చేసే అంశంపై శివసేన ఇప్పటి వరకు ఏ విషయం చెప్పలేదు. అయితే తాము కలిసి పోటీ చేస్తామని, ముఖ్యమంత్రి మరోసారి తానేనని ఫడ్నవీస్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఈసారి కూడా శివసేనకు మొండి చెయ్యేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story