కడపలో నాటుబాంబుల కలకలం..

కడపలో నాటుబాంబుల కలకలం..
X

కడప జిల్లా జమ్మలమడుగులో నాటుబాంబులు కలకలం రేపాయి. ముద్దనూరు రోడ్డు పక్కన ఓ నాయకునికి సంబంధించిన పొలంలో ప్లాట్లు వేస్తున్నారు. దీని కోసం మట్టిని చదును చేస్తుండగా ఒక బాంబుల బకెట్‌ బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని బకెట్‌ బయటపడ్డ స్థలానికి సమీపంలో తవ్వగా మరో 3 బకెట్లు కనిపించాయి. మొత్తం నాలుగు బకెట్లలో 54 బాంబులున్నాయి.

ఈనెల 8వ తేదీన జమ్మలమడుగులో రాష్ట్ర ప్రభుత్వం రైతుదినోత్సవం కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం వచ్చేందుకు వీలుగా ఇక్కడ ఒక హెలిప్యాడ్‌, పక్కనే సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బాంబులు దొరికిన స్థలం హెలిప్యాడ్‌కు కేవలం 500 మీటర్లదూరంలో ఉంది. పోలీసులు సరిగా తనిఖీలు చేసి ఉంటే ఇవి అప్పుడే దొరికేవని స్థానికులు అంటున్నారు.

మరోవైపు ఈ మధ్యకాలంలో జమ్మలమడుగు ప్రాంతంలో ఒకేచోట ఒకేసారి ఇన్ని బాంబులు దొరకడం మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు. ఈ స్థలానికి సంబంధించిన వివరాలు, పూర్వం ఇక్కడ ఎవరు ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం పొలం ఎవరిది, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది విచారించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

Tags

Next Story