మరణించింది.. మళ్లీ బతికింది

మరణించింది.. మళ్లీ బతికింది

జనన మరణాలు దేవుడు ముందే నిర్ణయిస్తాడంటారు. మరి అది ఎంతవరకు నిజం. ప్రాణం పోయిందంటూ డాక్టర్లు ఇంటికి పంపించేసినా కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ మళ్లీ లేచి కూర్చుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం. నిజంగా ఊపిరి ఆగిపోతేనే కదా వైద్యులు ఇంటికి తీసుకెళ్లిపొమ్మంటారు. లేకపోతే డాక్టర్ వృత్తికే అవమానం. అయినవారి ఆర్తనాదాల మధ్య నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తిలో కదలికలు మొదలై బ్రతకాలన్న ఆశ కళ్లలో కనిపిస్తుంది. కర్ణాటక రాయచూరు కొప్పళ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనూహ్య సంఘటన జరిగింది. కొప్పళకు చెందిన కుంభార మంజునాథ్‌కు బాగల్‌కోట్ జిల్లా గోవనకు చెందిన కవితతో వివాహమైంది. వీరికి అయిదుగురు ఆడ పిల్లలు ఉన్నారు. అయినా మగపిల్లాడి కోసం ఆశగా ఎదురు చూశారు. ఆరో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. ఆ తరువాత పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామని కవిత కేఎన్ ఆస్పత్రిలో చేరింది. అధిక రక్త స్రావం అవతుండడంతో బలహీనంగా ఉందని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లమని బంధువులతో చెప్పారు. బిల్లు లక్షరూపాయలు కట్టి శవాన్ని తీసుకెళ్లమన్నారు. బంధువులు విలపిస్తూ మృతదేహాన్ని అంబులెన్సులోకి తరలిస్తుండగా బాలింత కళ్లు తెరచి చూసింది. ఒక్క క్షణం బంధువులంతా భయపడ్డా వెంటనే తేరుకుని తిరిగి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. బతికి ఉన్న మనిషిని చనిపోయిందని చెప్పిన వైద్యులపై మండిపడుతూ ధర్నా చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవితకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story