తెలుగు రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ.. అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.. బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా... పావులు కదుపుతోంది. ఇందుకోసం అనువైన మార్గాలను అన్వేషించి.. ప్రజల్ని తమవైపుకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదన్న బీజేపీ.. ఇప్పుడు దీన్ని ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోంది.
ఏపీ, తెలంగాణతో పాటు జమ్మూకాశ్మీర్, సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజనకు రెడీ అయింది. ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. నాలుగు రాష్ట్రాల్లో పునర్విభజనకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని చెప్పాలంటూ కేబినెట్ నోట్‌ను.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది హోంశాఖ. అయితే... కేంద్రం పంపిన ఈ నోట్ సరిగా లేదని.. సరైన సమాచారంతో మరోసారి పంపాలని హోంశాఖను కోరింది ఎన్నికల సంఘం. మొత్తానికి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కీలకమైన సవరణలు చేయాల్సిన నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ సవరణలతో బిల్లును గట్టేక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225కు పెరిగే అవకాశం ఉంది. అలాగే తెలంగణలో ఉన్న 119 స్థానాలు 151కి పెరిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com