బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కుమారస్వామి

కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. సర్కార్ ఏర్పా టు ప్రక్రియపై బీజేపీ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్‌ సిగ్నల్ రాలేదు. దీంతో అధిష్టానం ఆదేశాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ సురేశ్ కుమార్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారి రాజీనామాలు ఆమోదించిన తరువాతే తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. బలాబలాల లెక్కలు చూసుకున్నాకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు టాక్‌. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది.

బీజేపీ ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఏర్పాటుచేసినా స్వతంత్ర ఎమ్మెల్యేలపైనే ఆధార పడాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో మొత్తం స్థానాలు 225. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు స్వతంత్రులు మద్దతు తెలిపారు. దీంతో వారి బలం 107కు పెరిగింది. స్వతంత్రులు మద్దతు ఉపసంహరిస్తే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న బీజేపీకి చిక్కులు తప్పవు. 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేస్తారా? లేక వారి రాజీనామాలను ఆమోదిస్తారా? అన్న విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వారి రాజీనామాలను తిరస్కరిస్తే కన్నడ నాట మళ్లీ హైడ్రామా చోటుచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు రాజీనామాల ఆమోదం విషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకునేంతవరకు బెంగళూరుకు తిరిగి వచ్చేది లేదని రెబల్‌ ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు పక్కన పెడితే.. కర్నాటక సీఎం ఎవరు అన్నది ఇప్పటి వరకు బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. తానే కాబోయే సీఎం అని భావిస్తున్న యడ్యూర్పకు ఇంత వరకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు. ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారు క్రియాశీలక పదవుల్లో ఉండరాదనేది బీజేపీ అంతర్గత నిబంధన. ఈ కారణంతోనే బీజేపీ కురు వృద్ధుడు అద్వానీని పక్కకు పెట్టారు. ఈ లెక్కన చూస్తే 76 ఏళ్ల వయసున్న యడ్యూరప్పను కూడా బీజేపీ అధిష్టానం పక్కకు పెడుతుందా? ముఖ్యమంత్రి పదవికి ఆయన వయస్సే అడ్డం కానుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లోజోరుగా సాగుతోంది.

అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండానే ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేసుకుంటున్నారు యడ్యూరప్ప. ప్రమాణ స్వీకారం గురువారం కాకుండా శుక్రవారం చేస్తారనని కూడా ఇప్పటికే యడ్యూరప్ప ప్రకటించారు. మరోవైపు బెంగళూరులోని ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లి సంఘ్ నేతలతో చర్చించిన యడ్యూరప్ప.. సీఎం పీఠం కోసం వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అటు ఆపద్ధర్మ సీఎం కుమారస్వామి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చిన రెబల్ ఎమ్మెల్యేలు, యడ్యూరప్పకు.. అదే గతి పట్టిస్తారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదని అన్నారు కుమారస్వామి. ఇలా వరుస పరిణామాలు చూస్తే కర్నాటకీయం ఇంకా కొనసాగేలానే కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story