జగన్‌, కేసీఆర్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది - చంద్రబాబు

జగన్‌, కేసీఆర్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది - చంద్రబాబు

అసెంబ్లీ నిర్వహణపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నీళ్ల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల కోసం కేసీఆర్‌ నిధులు ఇస్తే.. ఇప్పుడు క్విడ్‌ ప్రో కింద కేసీఆర్‌కు జగన్‌ నీళ్లు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం పోలవరంపై విషం కక్కుతున్నారని.. అమరావతి నిర్మాణాన్ని నాశనం చేస్తున్నారన్నారు చంద్రబాబు.

అసెంబ్లీలో సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ‌ ప్రజా సమస్యలపై తమ సభ్యులు గట్టిగా అడిగినంత మాత్రాన సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని నిలదీశారు. తాము మాట్లాడేసరికి మైక్‌ ఆపేస్తున్నారని, అందుకే తాము సభ నుంచి వాకౌట్‌ చేసినట్లు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వైఖరిని గతంలో జగన్‌ విమర్శించారని గుర్తు చేశారు. అదే వ్యక్తి ఇప్పుడు కేసీఆర్‌ను పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌, కేసీఆర్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందన్నారు. కేసీఆర్‌ కోసం ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్‌, జగన్‌ అధికారం శాశ్వతం కాదన్నారు చంద్రబాబు. ఇది రెండు రాష్ట్రాల ప్రజల సమస్య అన్నారాయన. ప్రజావేదిక కట్టేందుకు 8 నెలలు పట్టిందని, కానీ కూల్చేందుకు కొన్ని గంటలే పట్టిందని గుర్తు చేశారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటోందన్నారు. జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోలవరం టెండర్ల విషయంలో కావాలని బురద చల్లుతున్నారన్నారు. పీపీఏలపై సమీక్షలంటూ పెట్టుబడిదారులు రాకుండా చేశారని విమర్శించారు. 2004లో ఇచ్చిన ఖర్చులు 2017లో మారవా అని ప్రశ్నించారు. ప్రతి కార్యక్రమంలో అవినీతి జరిగిందనడం అలవాటైందని విమర్శించారు. వైసీపీ చర్యలను త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారన్నారు. ప్రజలే తిరుగుబాటు చేస్తారన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story