16 ఏళ్ల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

16 ఏళ్ల తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం... సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి ఏర్పాట్లు... డ్రగ్ సరఫరాదారులపై కఠిన శిక్షలు.. H1B వీసాల జారీపై కఠిన నిబంధనలు.. ఇవీ ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాలు. వీటితోపాటు చాలానే వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. ఏది ఏమైనా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు... తాజాగా 16 ఏళ్ల తర్వాత దేశంలో మరణ శిక్షలు అమలు చేయాలని నిర్ణయించి సంచలనం సృష్టించారు. ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడినవారికి మరణ శిక్షవిధించాలని న్యాయశాఖ చెపుతోందని, దాన్ని అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ అటార్నీ జనరల్ విలియం బార్ తెలిపారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేయడంలో భాగంగా ఈ శిక్షలు విధించే తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే కఠిన శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు ఖైదీలకు మరణ శిక్ష అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జైళ్లశాఖను కోరారు అటార్నీ జనరల్ విలియమ్ బార్. వీరు హత్యలు, పిల్లలపై అత్యాచారం కేసులో శిక్షలు అనుభవిస్తున్నారని వెల్లడించారు. వీరికి వచ్చే డిసెంబర్ లేదా 2020 జనవరిలో మరణ శిక్ష అమలయ్యే అవకాశం ఉంది.

దేశంలో మరణశిక్షల అమలుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా మద్దతు ప్రకటించారు. మాదక ద్రవ్యాలు విక్రయించేవారితోపాటు హత్యలకు పాల్పడేవారికి మరణశిక్షలు అమలు చేయాలని ఆయన జాతీయ, అన్నిరాష్ట్రాల పోలీసుల అధికారులను కోరారు. మరణశిక్షలు అమలు చేసేనిబంధన తనకు ఏమాత్రం ఆశ్చర్యం కల్గించలేదని, ఇది అమలు చేసేందుకు ఇంతకాలం పట్టినందుకే తనకు ఆశ్చర్యమేసిందన్నారు ట్రంప్.

అమెరికాలో 2003 నుంచి మరణశిక్షలు నిలిపివేశారు. చివరగా 53 ఏళ్ల గల్ఫ్ వార్ లో పాల్గొన్న లూయిస్ జోన్, 19 ఏళ్ల ట్రాసీ జోయ్ మెక్ బ్రిడ్ ను హత్యచేసిన కేసులో మరణశిక్ష అమలు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు దేశంలో ఎవరికి మరణశిక్ష విధించలేదు. అయితే క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే చట్టాన్ని తీసుకురావాలంటూ న్యాయశాఖ చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. అమెరికాలో మరణశిక్షల అమలు మూడు శాఖలతో ఏర్పాటైన కమిటీ అమలు చేస్తోంది. న్యాయశాఖ, నేరవిభాగం, ఫెడరల్ కోర్టు ఇందులో ఉంటాయి. అయితే రాష్ట్రస్థాయిలో కూడా రాష్ట్రకోర్టు సమక్షంలో అమలు చేస్తారు.

అమెరికన్ సుప్రీంకోర్టు 1972 లో జాతీయ, రాష్ట్రస్థాయిలో మరణశిక్షలను నిలిపివేసింది. ఆ తర్వాత 1976లో కొన్ని రాష్ట్రాల్లో ఈ శిక్షలు అమలు చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. 1988లో జాతీయ స్థాయిలో ఈ శిక్షలను అమలు చేసేందుకు అవకాశం కల్పించింది. మరణశిక్షలు అమలు చేసే సెంటర్ వెల్లడించిన లెక్కల ప్రకారం 1988 నుంచి 2018 వరకు అమెరికా వ్యాప్తంగా 78 మందికి మరణశిక్షలు పడ్డాయి. అయితే ఇందులో ముగ్గురికి మినహాయింపు ఇవ్వగా.... వీరిలో 62మంది ఖైదీలకు మరణ శిక్షలు అమలు చేశారు.

అమెరికాలో మరణశిక్ష పడిన ఖైదీలను భారత్ లో అమలవుతున్న విధంగా ఉరిశిక్షలు వేసి శిక్షలు అమలుచేయరు. శిక్షపడిన ఖైదీల శరీరంలోకి విషాన్ని సిరంజీ ద్వారా ఎక్కించి మరణించేలా చేస్తారు. దాని వల్ల అతని నాడి వ్యవస్థ దెబ్బతిని వ్యక్తి మరణిస్తాడు. ఇందుకోసం ఓ గదిలో ప్రత్యేకంగా రూపొందించిన మంచం ఉంటుంది. అయితే ట్రంప్ కోరుతున్నట్లు డ్రగ్ మాఫియా, హత్యలకు పాల్పడేవారికి గానీ మరణశిక్షలు విధిస్తే ప్రతినెలా పదుల సంఖ్యలో మరణ శిక్షలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజా సంఘాలు స్పందించాయి. ఈ శిక్షలు అమలు చేసే విధానం బహిరంగపర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story