'ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలి'

ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పాలి
X

సమాజ్‌వాది పార్టీ ఎంపీ ఆజమ్‌ఖాన్ చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి నోరుజారారు ఆజమ్ ఖాన్. మీ కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై లోక్‌సభలో రెండో రోజూ వాడివేడి చర్చ జరిగింది. ఆజమ్ ఖాన్‌ తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే సభ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు మహిళా సభ్యులు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మల సీతారామన్‌, బాబుల్‌ సుప్రియో, ఎంపీలు సుప్రియా సూలే, కల్యాణ్‌ బెనర్జీ, మహతబ్‌... ఆజమ్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

అటు కాంగ్రెస్‌ కూడా ఆజమ్‌ఖాన్‌ వ్యాఖ్యలను ఖండించింది. మహిళలను అగౌరవపరచడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.... గతంలో సోనియాగాంధీపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు గుర్తుచేశారు. ఆజమ్‌ఖాన్‌ క్షమాపణ చెప్పకపోతే సభ నుంచి సస్పెండ్‌ చేయాలని బీజేపీ తరఫున డిమాండ్‌ చేశారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.

ఈ వివాదంపై స్పీకర్‌ ఓంబిర్లా స్పందించారు. దీనిపై అన్ని పార్టీల నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.... ఆజమ్‌ఖాన్‌ వ్యాఖ్యలపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ మండిపడ్డారు. ఇది చాలా విచారకరమని, ఇలాంటి వాళ్లకు ఓ శిక్షణ కార్యక్రమం పెట్టాలని అప్పుడే పార్లమెంట్‌లో ఎలా ప్రవర్తించాలో వారు నేర్చుకుంటారని అన్నారు. అటు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కూడా ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌కే కాదు.. మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story