ఆ సంఖ్యను యడియూరప్ప ఎలా కూడగడతారో..?

ఆ సంఖ్యను యడియూరప్ప ఎలా కూడగడతారో..?

కర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాల మధ్య యడ్యూరప్ప నాలుగోవసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. యడ్యూరప్పతో... గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు..

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు రాజ్‌భవన్‌కు తరలివచ్చారు.ఇవాళ ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. బల నిరూపణ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తారని సమాచారం. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్‌.కృష్ణ, మురళీధర్‌రావు, బీజేపీ నేతలు. కార్యకర్తలు పాల్గొన్నారు. యడ్డీ ప్రమాణస్వీకారానికి అసంతృప్త ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ కూడా హాజరయ్యారు.

రెండ్రోజుల క్రితం కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించినా.. ఈ దిశగా ఎలాంటి అడుగులూ పడకపోవడంతో సందిగ్ధత నెలకొంది. అయితే, ఇవాళ నాటి పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ యడియూరప్ప గవర్నర్‌ వాజుభాయి వాలాను కలిశారు. ఆయన విజ్ఞప్తికి గవర్నర్‌ సమ్మతించడంతో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 2007 నవంబర్‌లో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా మద్దతిస్తామని చెప్పిన జేడీఎస్‌ మాట మార్చడంతో నాలుగు రోజులకే ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో 2011లో తన పదవికి రాజీనామా చేశారు. తనను సీఎం పదవి నుంచి దించిన బీజేపీపై అలిగిన యడియూరప్ప 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి కర్ణాటక జనతాపక్ష పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. అయితే, ఆ పార్టీ పట్ల జనాదరణ లేకపోవడంతో తిరిగి 2014లో తన పార్టీని బీజేపీలో వీలీనం చేశారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో షిమోగా నుంచి విజయం సాధించారు.

2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్‌ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఆయన మూడోసారి ప్రమాణం చేసినా మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో రెండు రోజుల్లోనే రాజీనామా చేశారు. ఇప్పటివరకు మూడుసార్లు సీఎం పదవి చేపట్టిన యడియూరప్ప ఎప్పుడూ పూర్తిస్థాయిలో పదవిలో కొనసాగక పోవడం గమనార్హం.

నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేసినా... కర్నాటక రాజకీయాలు ఇప్పటికీ ఆసక్తిని రేపుతున్నాయి. ప్రమాణస్వీకారం అనంతరం యడియూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం గవర్నర్ వాజూభాయ్ వాలా ఏకంగా ఈనెల 31 వరకు సమయం ఇచ్చారు. 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే బలాన్ని ఏవిధంగా నిరూపించుకుంటారన్న అంశం ఆసక్తిగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా.. గురువారం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 222కు పడిపోయింది. అందులో స్పీకర్‌ను తీసేస్తే ఆ సంఖ్య 221 కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 112 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా.. మరో స్వతంత్ర సభ్యుడు మద్దతు ఇస్తున్నారు. సాధారణ మెజార్టీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సంఖ్యను యడియూరప్ప ఎలా కూడగడతారనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story