ఎంత నిరీక్షించిన 'అర్చన' లాంటి తారలు అరుదుగా..

ఎంత నిరీక్షించిన అర్చన లాంటి తారలు అరుదుగా..

చుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడబోయినావే .. ఇన్నియేల చుక్కల్లో అనే పాట వింటే చాలు.. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ శృంగారానికి, వల్గారిటీకి మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ.. ఆ రూపం మురిపిస్తుంది. రంగు తక్కువే కానీ.. రంగంలోకి దిగితే ఆమె ప్రతిభ ముందు ఇంకెవరూ నిలవరు. అందుకే అనేక అవార్డులు ఆ నటనకు దాసోహమన్నాయి. నవ్వితే నవరత్నాలు మెరిసినట్టు కనిపించే ఆ రూపం పేరు అర్చన. చేసింది చాలా తక్కువ సినిమాలు.. కానీ తన నటనతో చాలా ఎక్కువ గుర్తుంచుకునేలా అద్భుత ప్రతిభ చూపింది. శనివారం అర్చన పుట్టిన రోజు.

దర్శక దిగ్గజం బాలుమహేంద్ర కనిపెట్టిన ప్రతిభా మాయాజాలం అర్చన. ఆయన సినిమా కంటే ముందే సినిమాల్లోకి ప్రవేశించినా.. బాలు మహేంద్ర తర్వాతే అర్చన ప్రతిభ అందరికీ తెలిసింది. నిరీక్షణ సినిమా నుంచి తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తమిళ చిత్రం వీడు వరకూ అర్చన బాలు కెమెరా కనుసన్నల్లోనే తన హావభావాలకు మెరుగులు దిద్దుకుంది. అసలు నిరీక్షణ లాంటి సినిమా ఒప్పుకోవడంలోనే ధైర్యం ఉంది. ఓ గిరిజన యువతిగా సినిమా అంతా జాకెట్ లేకుండా నటించడం అంటే మాటలు కాదు. కానీ బాలుమహేంద్ర దర్శకత్వ, కెమెరా పనితనంతో ఆమె చేసిన పాత్రలో, ధరించిన దుస్తుల్లో ఎక్కడా అశ్లీలత కనిపించదు. అయినా సరే తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను మనసులను మెలిపెట్టేసిందీ నల్ల కలువ. నిరీక్షణ సినిమాతో తెలుగులో స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ అందుకుందీ ప్రతిభార్చన. నిజానికి అర్చనకు వచ్చిన అవకాశాలు, ఉన్న ప్రతిభను బట్టి ఎన్నో సినిమాల్లో నటించి ఉండాల్సింది. కానీ కథకు చాలా ప్రాధాన్యతనిస్తూ.. ముందు నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేసింది. అందుకే ఆమె ఖాతాలో తక్కువ సినిమాలే ఉంటాయి.. అయినా అందులో రెండు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి. ఇది చాలదూ అర్చన ప్రతిభేంటో తెలియడానికి.

తమిళంలోనూ నిరీక్షణ మంచి హిట్ అయింది. తర్వాత కూడా మరికొన్ని అలాంటి డీ గ్లామర్ పాత్రలే చేసింది. దీంతో అర్చన అంటే గ్లమరస్ పాత్రలకు పనికి రాదన్నారు కొందరు. వారికి సమాధానంగా తెలుగులో లేడీస్ టైలర్ చేసింది. ఇందులో ఇతర పాత్రలు ఎంత ఎక్స్ పోజ్ చేసినా.. అర్చన ముందు బలాదూర్ అయిపోయారు. అంత గ్లమరస్ గా నటించిందీ సినిమాలో. అయితే కథానుసారంగానే తప్ప.. కావాలని ఎప్పుడూ హద్దులు దాటలేదు అర్చన. తెలుగులో మధుర గీతం అనే సినిమాతో పరిచయమైన అర్చన ఆ తర్వాతి యేడాదే నిరీక్షణ చేసింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ కాకపోయినా చాలామంది కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది.. అయితే లేడీస్ టైలర్ మాత్రం ఆమెకు భిన్నమైన ఇమేజ్ ను, గుర్తింపును ఇచ్చింది. ఒకవేళ ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తే ఎలా ఉండేదో కానీ, అర్చన మాత్రం మంచి కథ అనిపిస్తే చాలు.. ఎక్కడా కుదురుగా ఉండలేదు. తమిళ, తెలుగు, మళయాలం, కన్నడ, బెంగాళీ, హిందీ అంటూ అన్ని ఉడ్స్ నూ చుట్టేసింది.

ఇక తెలుగులో పచ్చతోరణం, ఉక్కు సంకెళ్లు, మట్టిమనుషులు, భారత్ బంద్ లాంటి సినిమాలతో మనవారినీ అప్పుడప్పుడూ పలకరిస్తూ వచ్చింది. వీటిలో భారత్ బంద్ లో అర్చన చేసిన పాత్ర ప్రతిఘటనలోని విజయశాంతిని గుర్తుకు తెస్తుంది. భారత్ బంద్ లో తన ఫస్ట్ సీన్ లోనే తుపాకి పక్కన బెట్టుకుని పాఠాలు చెప్పే లెక్చరర్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ ను పర్ఫెక్ట్ గా పోషించింది. అర్చన.. చూడగానే కళ్లు తిరిగిపడిపోయేంత అందగత్తె కాకపోవచ్చు.. కానీ ఆమె సినిమాలు చూస్తే కళ్లు చెమర్చే నటన చూపించగలదు. పాత్రలో లీనమై.. మనల్నీ తన పాత్రలో లీనం చేయగల మోస్ట్ టాలెంటెడ్ గాళ్ తను. అందుకే వరుసగా రెండేళ్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకోగలిగింది. ఓ ప్రాంతీయ చిత్ర నటికి ఇలాంటి గౌరవం దక్కడం శారద తర్వాత అర్చనకే అంటే ఆశ్చర్యమేం లేదు. తెలుగులో వచ్చిన ‘దాసి’, తమిళంలో చేసిన ‘వీడు’ చిత్రాలకు ఆమె జాతీయ అవార్డులు అందుకుంది.

మా భూమి చిత్రంతో సంచలనం సృష్టించిన బి నర్సింగరావు దర్శకత్వంలో వచ్చిన దాసి చిత్రం కూడా నాటి తెలంగాణ దొరల ఆగడాలకు అద్దం పట్టిన చిత్రమే. ఇందులో ఇరవై రూపాయలకు తన కూతుర్ని దొరకు అమ్మేస్తాడో తండ్రి... తర్వాత తనకు యవ్వనం కూడా రాకముందే వారి ఆగడాలకు ఆగమైన జీవితంతో స్వేఛ్ఛా వాయువుల కలలు కంటూ ఆ దొరల గడీలోనే మగ్గిపోయే పాత్రలో అర్చన నటన అసామాన్యం.. కొన్ని పాత్రలు ఊహించి చేయొచ్చు.. మరికొన్ని పాత్రలు ఊహకు అందవు. అలాంటిదే దాసి చిత్రంలో అర్చన చేసిన పాత్ర. అందుకే 1987లో చేసిన ఈ చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ వచ్చింది. ఇక 1988లో చేసిన తమిళ చిత్రం వీడు కూడా భిన్నమైనదే. మరోసారి ఆమె గురువుగా భావించే బాలుమహేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో చేసిన ఈ చిత్రంలో భానుచందర్ హీరో. కుటుంబ బాధ్యతలతో పెళ్లి చేసుకోకుండా ఓ చిన్న ఆఫీస్ లో పని చేస్తున్న యువతి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఆమె పడ్డ శ్రమలు.. డబ్బు కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు.. అలాంటి ఒంటరి యువతుల పట్ల సమాజం చూసే చూపు లాంటి వాటి కలయికలో వచ్చిన వీడులోనూ అర్చన నటన అద్భుతం. ఈ చిత్రానికి మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది అర్చన.

మన హీరోయిన్లు దక్షిణాదిలో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కు వెళతారు. కానీ అందుకు భిన్నంగా అర్చన మాత్రం 1973లోనే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘యాదోం కి బారాత్’ లో నటించి, తర్వాతే సొంత గడ్డకు వచ్చింది. అంటే ముందు రచ్చగెలిచి ఆ తర్వాతే ఇంటికి వచ్చిందన్నమాట. తమిళంలో సినిమా రంగంలో ఫేమ్ అయిన అర్చన తెలుగు ఫ్యామిలీ అమ్మాయే. ఇక అర్చన తమిళనాడు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో యాక్టింగ్ కోర్స్ లో గ్రాడ్యుయేట్ అన్న విషయం చాలామందికి తెలియదు. నటిగా అవకాశాలున్నప్పుడే పెళ్లి చేసుకున్న అర్చన తర్వాత వెండితెర వైపు చాలాకాలం వరకూ చూడలేదు. అయితే తనకు నచ్చిన పాత్రలు వస్తే చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమే అని చెబుతూ వస్తోంది. ఆ మధ్య కన్నడలో సూపర్ హిట్ అయిన జోగికి రీమేక్ గా తమిళంలో వచ్చిన ‘పరట్టై ఎంగిర అళుగు సుందరమ్’ లో తల్లిగా తన వయసుకు మించిన పాత్రలో కనిపించింది. తెలుగులో యోగిగా రీమేక్ అయిన ఆ పాత్రను ఇక్కడ శారద పోషించింది. తనకు బాగా నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెబుతోంది అర్చన. అయితే ఎటొచ్చీ ఇప్పుడు అలాంటి వారి కోసం పాత్రలు క్రియేట్ చేస్తున్నవారు ఎవరున్నారు. పైగా సెలెక్టివ్ సినిమాలంటూ వెయిట్ చేస్తున్న అర్చన కోరిక తీరుతుందంటారా.. అయినా త్వరలోనే మంచి అవకాశాలు రావాలని.. తెలుగులోనూ మంచి పాత్రల్లోనూ కనిపించాలని కోరుకుంటూ ఈ ప్రతిభార్చనకు జన్మదిన శుభాకాంక్షలు.

- k. బాబురావు

Tags

Read MoreRead Less
Next Story