అస్సలేం గుర్తుకు రావు 'చిత్ర' గానం వింటుంటే..

అస్సలేం గుర్తుకు రావు చిత్ర గానం వింటుంటే..

చిత్ర.. ఆ గానం వింటే ఎంతటి బాధలో ఉన్నవారికైనా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆమె పాట వింటే కోకిల సైతం మైమరచిపోవల్సిందే.. తన పాట వింటూ కూర్చున్నామంటే అస్సలేం గుర్తుకు రాదు మనకు. అందుకే ఆమె ఖాతాలో వేల పాటలున్నాయి.. ఎవ్వరికీ లేనన్ని జాతీయ, రాష్ట్రీయ అవార్డులున్నాయి. మళయాల చిత్ర పరిశ్రమ నుంచి పరిచయమైన ఈ గాన కోకిల దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు మరెన్నో భాషల్లో పాడారు.. విజయాలెన్ని ఉన్నా వినమ్రతే ఆస్తిగా గానయానం సాగిస్తోన్న లిటిల్ నైటింగేల్ చిత్ర పుట్టిన రోజు నేడు (జూలై 27).

చిత్ర.. కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఆమెది సంగీత కుటుంబం. చిన్నప్పుడే చిత్రలోని గాన ప్రతిభను తండ్రి కృష్ణన్‌నాయర్‌ గుర్తించారు. ఆయనే చిత్రకు ప్రథమ గురువుగా సంగీతంలో ఓనమాలు నేర్పారు. తరువాత కర్ణాటక సంగీత విద్వాంసుడు డా కె.ఓమనకుట్టి వద్ద సంగీతంలో పూర్తిస్థాయి శిక్షణ పొంది కేరళ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో మాస్టర్స్‌ పట్టాను సంపాదించారు. 1978లో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్ షిప్ పొందారు. అంతటి శిక్షణ పొంది సహజమైనప్రతిభకు మెరుగులు దిద్దుకుంది కాబట్టే తర్వాత కాలంలో ఎన్నో విజయ శిఖరాలు అధిరోహించారు.70ల మధ్య నుంచే గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టినా 80ల చివరి నుంచే చిత్ర గానామృతం తెలుగువారిని తాకింది. ముఖ్యంగా 1991లో వచ్చిన సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో ఆమె పాడిన పాటలకు మనవాళ్లు ఫిదా అయిపోయారు. కలికి చిలకలకొలికి అనే పాటతో తెలుగు వారి గుండెల్లో చోటును సుస్థిరం చేసుకున్నారు.

అటుపై మాతృదేవోభవ సినిమాలో చిత్ర పాటకు కన్నీరు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు.. వేణువై వచ్చాను భువనానికి అంటూ గానంలో లీనమైన చిత్ర పాట ఎన్నో గుండెల్ని మెలిపెట్టింది.. అలాంటి పాటలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. సుశీలమ్మ, జానకమ్మల తర్వాత తెలుగు పాట తనదే అని గానాపథంగా చెప్పేశారు. తనదైన ప్రతిభతో చిత్రకు చిన్న కోకిల, లిటిల్ నైటింగేల్ అనే పేరు పడిపోయింది. ఆ పేరుకు ఏమాత్రం లోటు లేకుండా చిత్ర పాటలు వింటే శ్రోతల మనసుల్లో అమృతవర్షం కురుస్తుంది. ఆ పాటలను అలా వింటూ ఉండాల నిపిస్తుంది. ఒక తన్మయత్వం, తెలియని మైమరుపు. ఎంతమంది కొత్త గాయనీమణులు వస్తున్నా ఆమె పాటలలో ఒక మాధుర్యం అలాగే నిలిచి ఉంది. ప్రతిభతో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించినా చిత్రకు పెట్టని ఆస్తి ఆమె వినమ్రతే. అసలు చిత్రలోని అసలు ప్రతిభను వెలికి తీసింది ఇళయరాజా.. రాజా కంపోజ్‌ చేసిన ‘నీతాన అంతా కుయిల్‌’ అనే చిత్రంలో ‘పూజైకెత్త పూవితు’ పాటతో మనకంటే ముందే తమిళ శ్రోతలకు పరిచయం అయ్యారు. అయితే ‘చిన్న కోకిల’ అనే బిరుదు మాత్రం ‘పూవ పూచుదవా’ చిత్రంలో ‘చిన్న కుయిల్‌ పాడుమ్‌’ అనే పాటతో వచ్చింది. అలా అతి తక్కువ కాలంలోనే తమిళం, మళయాళం, తెలుగు భాషలలో అత్యంత ప్రతిభావంతురాలైన గాయనిగా పేరుగడిం చారు. దేశవ్యాప్తంగా చిత్ర దాదాపు 30మందికి పైగా సంగీత దర్శకుల ట్యూన్స్ కు పాటలు పాడారు. ఇలా ఓ గాయని అంతమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేసింది.. బహుశా చిత్ర మాత్రమేనేమో.. వీరిలో ఎంతో మంది భారతదేశం లేదా వారున్న పరిశ్రమలు గర్వించదగ్గ ప్రతిభావంతులే చాలామంది ఉన్నారు. చిత్ర ఖాతాలో ఆరు జాతీయ అవార్డులున్నాయి. ఇండియాలో మరే గాయని ఖాతాలోనూ ఇన్ని నేషనల్ అవార్డ్స్ లేవు. అలాగే ఆమె సోలోగా పాడిన ఎన్నో తెలుగు పాటలు నంది అందుకున్నాయి.. డ్యూయొట్స్ నుంచి సోలోస్ వరకూ చిత్ర పాడిందంటే చాలు.. ఆ పాటలకు ఏదో ప్రత్యేకత వచ్చేస్తుంది. కలికి చిలకల కొలికి నుంచి కలవరమాయో మదిలో చిత్ర టైటిల్ సాంగ్ వరకూ చిత్ర పాటల తోటలో నంది వర్ధనాలై పూచాయి. టిపికల్ సాంగ్స్ పాడటంలో చిత్ర గాత్రం ఓ విధమైన అచ్చెరువును అందిస్తుంది. ఇక హుషారైన గీతాల సంగతైతే చెప్పలేం. ఆ గొంతులో పలికే గమకాలు గమ్మత్తును అందిస్తాయి.. ఆ హుషారులో మనమూ తడిసిపోతాం.. అదే చిత్ర శైలి.. పాటకు తగ్గ భావనను శ్రోతల వరకూ స్పష్టంగా తీసుకు వస్తుంది.

ఇక బాల సుబ్రహ్మణ్యం, చిత్ర కాంబినేషన్ లో వచ్చిన పాటలకు అంతేలేదు. అవి మెలోడీస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. తమ గానామృతంలో శ్రోతలను మైమరచిపోయేలా చేశారు. ఎన్నో పాటలున్నాయి గానీ.. అన్ని పాటలూ ఆకట్టుకన్నవే కావడమే ఈ జంట గొప్పదనం. అయితే తమిళ, హిందీ, మళయాల చిత్ర సీమల నుంచి ఆరు సార్లు జాతీయ అవార్డ్ అందుకున్న చిత్రకు తెలుగు నుంచి ఆ అవకాశం రాకపోవడం కాస్త నిరాశ కలిగించే అంశమే. మాతృదేవోభవ లోని వేణువై పాటకు వస్తుందేమో అనుకున్నారు చాలామంది. కానీ ఇతర భాషల నుంచే ఆమెకు జాతీయ అవార్డులు వచ్చాయి. క్లాసికల్‌ సంగీతంలో ప్రావీణ్యం ఉన్న చిత్ర అనేక ప్రైవేట్ ఆల్బమ్స్‌, ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌ చేశారు. పాప్‌ సంగీతంలో ప్రయత్నంగా ‘వూడు రాపర్‌’ అనే ఆల్బమ్‌ చేశారు. చిత్ర చేసిన ఆల్బమ్స్‌లో అత్యంత ఆధరణ పొందినది ‘పియా బసంతీ’ అనే హిందీ ఆల్బమ్‌. ‘పియా బంసంతీ’ని ప్రముఖ సారంగీ విద్వాంసుడు ‘సుల్తాన్‌ ఖాన్‌’ సహకారంతో నిర్మించారు. తరువాత కాలంలో గుల్జార్‌, భుపిందర్‌లతో కలిసి ‘సన్‌ సెట్‌ పాయింట్‌’ ను చేశారు. ఇలా తన సంగీత మజిలీలో అనేక ఆల్బమ్స్‌ చేశారు. కోకిల కుహూ అంటే ఎవరైనా విని పరవశిస్తారు.అలాగే సినీ అభిమానులు చిత్ర పాటలకు అంతగా పరవశిస్తారు.

చిత్ర పాడితే ఆ సాహిత్యంలోని భావన శ్రోతలను నేరుగా చేరుతుంది. అందుకే సుశీల, జానకమ్మల తర్వాత ఎక్కువ కాలం దక్షిణాది ప్రేక్షకులకు తన గానామృతాన్ని పంచగలిగింది. ఓ రకంగా ఓ ఫిమేల్ సింగర్ గా ఇంత ఎక్కువ కాలం కెరీర్ రన్ చేస్తున్న సింగర్ చిత్రే అనుకోవచ్చు. అటు బాలీవుడ్ నుంచి కొందరున్నా.. ఏవో ఒకటి రెండు పాటలు తప్ప, సింగిల్ కార్డ్ గా పాడటం అసాధ్యమనే చెప్పాలి. వేల పాటలతో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న చిత్ర వ్యక్తి గత జీవితంలో మాత్రం తీరని విషాదమే ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన ఏకైక కూతురు ప్రమాద వశాత్తూ మరణించింది. ఇప్పుడామె లేని లోటును పాటతోనే పూడ్చుకుంటోంది. అయినా కన్నపేగు బాధ కన్నవారికి తప్ప ఎవరికి తెలుస్తుంది. బాధను తనలోనే దాచుకుని.. పాటను మాత్రం అందిస్తూనే ఉందీ గానకోకిల.

- k. బాబురావు

Tags

Read MoreRead Less
Next Story