మళ్లీ మునిగిన ముంబై.. అస్తవ్యస్తమైన ప్రజా రవాణా

మళ్లీ మునిగిన ముంబై.. అస్తవ్యస్తమైన ప్రజా రవాణా

ముంబై మళ్లీ మునిగింది. ముంబైకర్లు ఉదయం నిద్రలేచే సరికి రోడ్లు కాల్వలుగా మారిపోయాయి. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఓవర్‌నైట్‌లో చాలా చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. శనివారం భారీ నుంచి అతిభారీ వర్షారు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబైకర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ముంబైలో ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. నగరానికి చేరుకోవాల్సిన రైళ్లను భారీ వర్షాల కారణంగా దారిలోనే నిలిపేశారు. ఉల్లాస్‌ నది ఉప్పొంగడంతో 2వేల మంది ప్రయాణికులున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ను బడ్లాపూర్‌ దగ్గర ఆపేశారు. రైలు పట్టాలపైకి నీరు చేరడంతో లోకల్‌ ట్రైన్స్‌ తిరగడం కష్టంగా మారింది. కళ్యాణ్‌-కర్జత్‌ మార్గంలో రైళ్లన్నీ రద్దయ్యాయి. కొన్ని రూట్లలో వీలైనంత నెమ్మదిగా వాటిని నడుపుతున్నారు. భారీ వర్షాల ప్రభావం విమాన రాకపోకలపైనా పడుతోంది. ఇప్పటికే కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. మరికొన్ని రద్దు చేశారు.

బాంద్రా, అంధేరి, చెంబూర్, విద్యావిహార్, ఐరోలి, నేరుల్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లోతట్టు కాలనీలు, బస్తీల్లో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీరం ప్రాంతాల్లో చాలా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. ఈమధ్య కాలంలో కురిసిన వర్షాలకు పోవై, టన్సా సరస్సులు పొంగి పొర్లగా.. నిన్నటి వానలకు మోదక్‌ సాగర్‌ కూడా నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలను మరింత భయపెడుతోంది.

కొంకణ్ తీరంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, పుణె, రత్నగిరి జిల్లాల్లో కుండపోత తప్పదని చెప్తున్నారు. విదర్భ, మధ్యప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురుస్తాయని IMD స్పష్టంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story