విశాఖలో మైనింగ్‌ మాఫియా.. ధర్నాకు సిద్ధమైన రైతులు

విశాఖలో మైనింగ్‌ మాఫియా.. ధర్నాకు సిద్ధమైన రైతులు

విశాఖ జిల్లా రావికమతం మండలంలోని ఐదు పంచాయతీల్లో వేలాది ఎకరాలకు సాగునీరుందించే కల్యాణపులోవ రిజర్వాయర్‌ పరిరక్షణను అధికారులు గాలికి వదిలేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా కల్యాణపులోవకు గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్టు చుట్టూ ఉండే కొండల్లో జరుగుతోన్న మైనింగ్‌ వల్ల పరివాహక ప్రదేశం పూర్తిగా దెబ్బతింటోంది అంటూ చాలాకాలంగా పోరాడుతున్నా.. మైనింగ్‌ మాఫియా తీరు మారడం లేదు.

రైతులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు కల్యాణలోపులోవ జరుగుతోన్న అన్యాయాన్ని వెలుగెత్తి ప్రపంచానికి చాటడంతో కొత్త ప్రభత్వంలో కాస్త చలనం వచ్చింది. ఈ నెల 18న జె.కొత్తపట్నం గ్రామంలో రైతుల అభ్యంతరాలను వినేందుకు పబ్లిక్‌ హీరింగ్‌ నిర్వహించింది. రైతులు మైనింగ్‌ను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. మైనింగ్‌ కారణంగా కొండగడ్డలు మూసుకుపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేసిన ప్రదేశానికి ఇరిగేషన్‌ SE. ఈ నెల 20వ తేదీన వెళ్లారు. రైతుల అభ్యంతరాలను స్వయంగా చూసి తెలుసుకున్నారు.

ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతోంది. అయినా మైనింగ్‌ మాఫియా తీరు మాత్రం మారడం లేదు. యధావిధిగా తమపని తాను చేసుకుపోతోంది. ఏ ధైర్యంతో మైనింగ్‌ మాఫియా తవ్వకాలు కొనసాగిస్తోంది అనే అనుమానాలు మొదలయ్యాయి. జులై 5 నాటికి పనులు నిలిపి వేస్తామని రైతులకు హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్‌. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పనులు వెంటనే నిలిపివేయాలని మైనింగ్‌ కంపెనీకి అటవీశాఖ అధికారులు ఈనెల 20న నోటీసులు కూడా పంపారు. బివిఎల్‌ కంపెనీ తాత్కాలికంగా మైనింగ్‌ను ఆపినా, సాయికపిల్‌, స్టోన్‌ ప్లస్‌ సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయని జాతీయ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సైతం కలెక్టర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు, ప్రభుత్వం హామీలు ఇస్తున్నా.. మైనింగ్‌ పనులకు ఆగకపోవడంపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ అనకాపల్లిలో రైతులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story