బోనాలు సమర్పించడానికి ప్రధాన ఉద్దేశం ఇదేనా..!

బోనాలు సమర్పించడానికి ప్రధాన ఉద్దేశం ఇదేనా..!

హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎక్కడ చూసినా ఆషాడం బోనాల సందడే. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి ఎంత ఫేమసో... పాతబస్తీలో లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంతే వైభవంగా జరుగుతుంటాయి.

లాల్‌దర్వాజా బోనాలతోపాటే హరిబౌలి అక్కన్న, మాదన్న ఆలయాల్లోనూ బోనాల జాతర జరుగుతుంది. ఆ తర్వాత ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి, సుల్తాన్‌షాహీలోని జగదాంబా, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడిలో బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. బోనాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇక మతసామరస్యానికి ప్రతీకైన భాగ్యనగర బోనాల జాతర ఆదివారం, సోమవారం పాతబస్తీలో ధూంధాంగా జరగనుంది.

బోనం అంటే భోజనం అని అర్థం. అన్నంతోపాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. దీన్ని ఓ పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. పసుపు, కుంకుమ, వేప రెమ్మలతో అందంగా అలంకరించిన కుండ. అందులో అమ్మవారికి వండిన బోనం. దానిపై వెలిగించిన దీపం. పట్టు చీరలు కట్టుకుని... బోనం కుండను నెత్తిన పెట్టుకుని.. చేతిలో వేప రెమ్మలు పట్టుకుని మహిళలంతా వెళ్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. స్వయంగా అమ్మవారే దిగివచ్చినంతటి సంబరం.

డప్పు చప్పుళ్ల హోరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతలతో కోలాహలంగా మారుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడమంటే అదో పెద్ద పండుగే. జనం కలిసి ఆలయానికి వెళ్తుంటే అదో పెద్ద జాతరే. అమ్మా బైలెల్లినాదో అంటూ సాగే పాటలు జనాన్ని హుషారెత్తిస్తాయి. బోనాలు సమర్పించడానికి ప్రధాన ఉద్దేశం ఆషాడ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందనేది భక్తుల నమ్మకం. ఆడ పడుచులంతా పుట్టింటికి వస్తారు. దీంతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. ఇక భక్తులు అమ్మవారిని సొంత కూతురు ఇంటికి వచ్చిందని భావించి దేవిని దర్శిస్తారు. అమ్మకు నైవేద్యం సమర్పిస్తే... చల్లంగా చూస్తుందనేది భక్త జనం ప్రగాఢ నమ్మకం.

Tags

Read MoreRead Less
Next Story