Top

పిలిస్తే పలుకుతున్న వాన.. నరకం చూస్తున్న జనాలు..

పిలిస్తే పలుకుతున్న వాన.. నరకం చూస్తున్న జనాలు..
X

మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి మొదలైన వర్షాలు, మధ్యలో కాస్త తెరిపినిచ్చాయి. ఈవారంలో వానలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జోరుగా పడుతున్న వానలతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిస్థితి దారుణంగా మారింది. ఆగినట్లే ఆగి దంచికొడుతున్న వర్షాలతో ముంబైకర్లు నరకం చూస్తున్నారు.

శుక్రవారం నుంచి ముంబైలో ఒకటే వాన. ఓవర్‌నైట్‌లో చాలా చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో 15 నుంచి 18 సెంటీమీటర్ల మేర వర్షం కురిసిందని వాతావరణ విభాగం ప్రకటించింది. భారీ వర్షాలకు వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు కాల్వలుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

బాంద్రా, అంధేరీ, చెంబూర్, విద్యావిహార్, నేరుల్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇటీవలి వర్షాలకు పోవై, టన్సా సరస్సులు పొంగి పొర్లగా.. నిన్నటి వానలకు మోదక్‌ సాగర్‌ కూడా నిండిపోయింది. చెరువులు-కుంటలు పొంగిపొర్లుతుండడంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కుర్లా, థానే, పుణే, విదర్భ ప్రాంతాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. కొంకణ్ తీరంలోనూ వర్షాల జోరు బాగానే ఉంది. వర్షాల ధాటికి ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. రైల్వే సేవలు కూడా నిలిచిపోతున్నాయి. కుర్లా-థానే, కళ్యాణ్‌-కర్జత్‌ మార్గాల్లో రైళ్లను రద్దు చేశారు. కొన్ని రూట్లలో ట్రైన్లను వీలైనంత నెమ్మదిగా నడుపుతున్నారు. విమాన సర్వీసు లకు కూడా అంతరాయం కలిగింది. 17 విమానాలను దారి మళ్లించారు.

ఈశాన్య రాష్ట్రల్లోనూ వరుణుడి జోరు కొనసాగుతోంది. అసోం, మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఇంకా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బిహార్‌లో జల విలయం నుంచి చాలా జిల్లాలు తేరుకోలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు ముంబైలో కురుస్తోన్న భారీ వర్షాలకు నదులకు వరదలు రావడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిలో మార్పులు, దారి మళ్లింపులు,దూరాలను కుదిస్తూ నిర్ణయం చేశారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే ఈస్ట్ కోస్ట్, కోరమండల్,తిరుచారపల్లి హౌరా రైళ్లను రద్దు చేశారు.

Next Story

RELATED STORIES