తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు..

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. పొంగి పొర్లుతున్న వాగులు..

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విశాఖ జిల్లా ముంచుంగిపుట్టు మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. ముంచంగిపుట్టు మండలం కర్లపొదర్‌ గ్రామ సమీపంలో ఓ కల్వర్టు కొట్టుకుపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్వర్టు పూర్తిగా మునిగిపోయి బలహీనపడింది. ఈ ఉదయం కల్వర్టు పూర్తిగా తెగిపోవడంతో... 27 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఒడిశాకు చెందిన 53 గ్రామాల వారికి సైతం రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.

మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏటూరునాగారం మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రామన్నగూడెం, రాంనగర్ వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు వరద కారణంగా నిలిచిపోయాయి.

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని నీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 13 గేట్లను ఎత్తి..దిగువకు 17300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వరద తాకిడి ఎక్కువైంది.మరోవైపు జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు జోరందుకున్నాయి. రాగల 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని , మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 31న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story