బోనాల జాతరలో హడావుడి అంతా వారిదే!

బోనాల జాతరలో హడావుడి అంతా వారిదే!

తెలంగాణలో బోనాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి ముఖ్యంగా రెండు. ఒకటి లష్కర్ బోనాలు. రెండు లాల్‌దర్వాజా భోనాలు. రెండు చోట్లా మహంకాళి అమ్మవారే. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహాకాళి కొలువుదీరితే.. లాల్‌దర్వాజాలో సింహ వాహిని మహంకాళి అమ్మవారు కొలువుదీరారు. ఈ గుడికి పెద్ద ఎర్రని దర్వాజా ఉండడంతోనే లాల్ దర్వాజా అనే పేరు స్థిరపడిపోయింది. ఇక ఈ ఇద్దరు అమ్మల బోనాలకు ఘనమైన చరిత్ర ఉంది.

లాల్‌ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాసం బోనాల్లో ప్రధానంగా రెండు ఘట్టాలున్నాయి. మొదటి రోజు అంటే ఆదివారం భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనాల జాతరలో భాగంగా మొదటి ఘట్టంలో ఈ నెల 19న ఉదయం ఆలయంలో కలశ స్థాపన, శిఖర పూజాతో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాలు ప్రారంభించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఇక బోనాల రోజున తెల్లవారుజామునే మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ. రాత్రి వేళ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ... శివ పార్వతుల శాంతి కళ్యాణం జరిపిస్తారు.

రెండో రోజున అంటే సోమవారం రంగం కార్యక్రమం, రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. లాల్‌ దర్వాజా ఆలయం వద్ద జరిగే రంగం కార్యక్రమంలో అనురాధ భవిష్య వాణి వినిపిస్తారు. ఆ తర్వాత ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో శాలిబండ నుంచి చార్మినార్ మీదుగా పురానాపుల్ వరకు భవానీ రధయాత్ర కన్నుల పండుగగా జరగుతుంది.

బోనాల జాతరలో హడావుడి అంతా పోతురాజులదే. అమ్మవారి ఏడుగురు అక్కాచెల్లెళ్ల ముద్దుల తమ్ముడు పోతురాజు. అమ్మవారు ప్రజలకు రక్షణగా ఉంటే.. పోతురాజు అమ్మవార్లకు కాపలా ఉంటారనేది ప్రతీతి. అలాంటి పోతురాజు వేషం వేసి బోనాల జాతరలో సందడి చేస్తుంది పోసాని కుటుంబం. ఓల్డ్ సిటీకి చెందిన పోసాని కుటుంబం 8 తరాలుగా పోతురాజుల వేషం వేస్తూ అమ్మవారి సేవలో తరలిస్తోంది.

లాల్‌ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చాయి. వాటి ఉధృతికి భాగ్యనగరం అతలాకుతలమైంది. అయితే అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్... లాల్ దర్వాజా సింహా వాహిని మహంకాళి అమ్మవారికి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన పసుపు, కుంకుమను మూసీ వరద నీటిలో కలిపారు. దీoతో మూసీ వరద ఉధృతి తగ్గిపోయి భాగ్యనగరం సురక్షితంగా ఉందని చరిత్ర చెప్తోంది. అప్పటి నుంచి 111 ఏళ్లుగా భాగ్యనగరంలో మత సామరస్యనికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story