తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో భారీ వర్షం..

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటి వరకు ఉక్కపోత, ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో పంట నీటి ముంపుకు గురయింది.. జిల్లాలోని విలీన మండలాలైన చింతూరులో 10 సెంటీ మీటర్లు, కూనవరంలో 5 సెంటీమీటర్లు, వీఆర్‌ పురంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, సీలేరు నదులు జలకళ సంతరించుకున్నాయి...

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు పొలాలన్నీ చెరువులయ్యాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానకు.. వరినాట్లు పూర్తిగా నీటమునిగాయి. జిల్లాలోని తణుకు, పెనుగొండల్లో వందల ఎకరాల పంటచేలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో పంట నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. సీజన్ దాటిపోయాక ఒక్కసారిగా ముంచెత్తిన కుండపోతకు పొలాలు మునిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీలో కల్వర్టు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి..

అటు తెలంగాణలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదారాబాద్ తడిసి ముద్దైంది. దీంతో వాహన రాకపోకలు పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి.. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇల్లందు, టేకులపల్లిలోని ఓపెన్ కాస్ట్‌ల్లో నీళ్లు రావడంతో ఉత్పత్తి నిలిపేశారు. కొత్తగూడెంలో కురిసిన భారీ వర్షం కారణంగా సింగరేణి, గౌతమ్‌పూర్ ఓపెన్ కాస్ట్‌లోకి నీరు చేరింది. రోడ్లు చిత్తడి చిత్తడిగా బురద కావడంతో ఎక్కడి యంత్రాలు అక్కడే నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది..

జయశంకర్ భూపాలపట్టి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి. పలు చోట్ల తాత్కాలికంగా వాగులపై నిర్మించిన వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్టు వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది..

ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏటూరునాగారం జీడివాగు పోటెత్తింది. జిల్లాలోని బోగత, ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో జిల్లాలోని చింతమాదర జలపాతాల సోయగాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు..

అటు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు మూడు రోజుల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story