నేడు యడియూరప్ప ప్రభుత్వం బల నిరూపణ.. అటు స్పీకర్..

నేడు యడియూరప్ప ప్రభుత్వం బల నిరూపణ.. అటు స్పీకర్..

కర్నాటకలో ఇవాళ యడియూరప్ప ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్ అనర్హత వేటు వేశారు. మొత్తం 14 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు పడింది. బలపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం పతనమైన మరుసటి రోజే స్పీకర్‌ రమేశ్‌ కుమార్ ముగ్గురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.. తాజాగా ఇప్పుడీ సంఖ్య 17కు చేరింది. ఇందులో ముగ్గురు జేడీఎస్‌, 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ షాకిచ్చారు.

మరోవైపు.... సీఎం యడియూరప్ప అధ్యక్షతన బీజేఏల్పీ సమావేశం జరిగింది. విశ్వాస పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ఇవాళ జరగబోయే బలపరీక్షలో నూరు శాతం తాము మెజారిటీ సాధిస్తామన్నారు యడియూరప్ప. విశ్వాస పరీక్ష అనంతరం వెంటనే ఆర్థిక బిల్లును ప్రవేశపెడతామని, దీన్ని అత్యవసరంగా ఆమోదించాల్సి ఉందని వివరించారు.

మరోవైపు.... విధానసౌధలో ఇవాళ ఉదయం 9 గంటలకు సిద్దరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం జరగనుంది. నూతన ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. జేడీఎస్‌ పార్టీ కూడా వేరుగా సమావేశమై తన నాయకుడిని ఎన్నుకోనుంది. స్పీకర్‌ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నించారని, ఆయన నిర్ణయం అవకాశవాదులకు చెంపపెట్టు అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

17మంది సభ్యులపై అనర్హత వేటు పడటంతో కర్ణాటక శాసనసభలో మెజార్టీ సాధనకు అవసరయైన మ్యాజిక్‌మార్కు 104 సభ్యులకు పడిపోయింది. బిజెపికి సొంతగానే కర్ణాటక అసెంబ్లీలో 105 మంది సభ్యుల మద్దతు ఉంది. మరో ఇండిపెండెంట్‌ సభ్యుడు కూడా ఆ పార్టీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌కు 66 జెడిఎస్‌కు33 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ సొంత బలం కంటే మ్యాజిక్ ఫిగర్ తక్కువగా ఉండడంతో కమలదళం ఊపిరి పీల్చుకుంది.. సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story