మద్యపాన నిషేధమా లేక నిషా దమ్మా.. జగన్‌పై లోకేష్‌ సెటైర్లు

మద్యపాన నిషేధమా లేక నిషా దమ్మా.. జగన్‌పై లోకేష్‌ సెటైర్లు

వైసీపీపై విమర్శల దాడి కొనసాగిస్తోంది టీడీపీ. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను, తప్పుడు విధానాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌. తాజాగా బందర్‌ పోర్టు, మద్యపాన నిషేధం విషయంలో జగన్‌ ప్రభుత్వ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు పోర్టును తెలంగాణ అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ 28న రహస్యంగా జీవో జారీ చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత జారీ చేయలేదంటూ మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇదేమని అడిగితే బుకాయించారని.. కానీ బందర్‌ పోర్టును తెలంగాణకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.

సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ప్రసాదించిన వరమన్న చంద్రబాబు... ఇలాంటి పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే టీడీపీ సహించబోదన్నారు టీడీపీ అధినేత. బందరు పోర్టును ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తుంటే.. మచిలీపట్నం డీప్‌ వాటర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి టీడీపీ నడుం కట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు.

అటు జగన్‌ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా విమర్శలు గుప్పించారు. అసమర్థులు ఒక్క ఛాన్స్ అంటూ ఎందుకు అడిగారు.. దోచుకోవడానికా లేక ప్రజల భవిష్యత్‌ను పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా అంటూ ట్విట్టర్లో నిలదీశారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్న జగన్‌... రేపు పాలన కూడా చేతకావట్లేదని కేసీఆర్‌ చేతుల్లో పెడతారా అని ప్రశ్నించారు.

మద్యపాన నిషేధంపై కూడా లోకేష్‌ సెటైర్లు వేశారు. జగన్‌ మద్యపాన నిషేధం అమలు చేస్తారంటే ఏదో అనుకున్నామని..‌ కానీ ప్రభుత్వమే మద్యం షాపులు తెరుస్తుందని ఊహించలేదన్నారు లోకేష్‌. గతం కంటే మరో 2 వేల 297 కోట్లు ఆదాయం గడిస్తారని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ రిపోర్టుకి మీ కలర్‌ వేయిస్తారని అర్థం చేసుకోలేకపోయామన్నారు‌. ఇది నిషేధమా లేక నిషాదమ్మా? అని ఎద్దేవా చేశారు లోకేష్‌.‌

Tags

Read MoreRead Less
Next Story