Top

కాపు రిజర్వేషన్ల రగడ.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన జగన్ సర్కార్!

కాపు రిజర్వేషన్ల రగడ.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన జగన్ సర్కార్!
X

కాపు రిజర్వేషన్లకు జగన్ సర్కార్‌ స్వస్తి పలకడంతో.. ఆ సమాజికవర్గం భగ్గుమంటోంది. ఆర్థిక బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు, మరో ఐదు శాతాన్ని ఇతర వర్గాలకు కేటాయిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. ఐతే.. రిజర్వేషన్లపై వివిధ కోర్టుల్లో కేసులు ఉన్న నేపథ్యంలో.. కాపు కోటాను అమలు చేయలేమని జగన్‌ సర్కార్‌ చెబుతోంది.

సీఎం జగన్‌ నిర్ణయంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం ఈబీసీ కోటాలో.. 5 శాతం కాపులకు అమలు చేయడానికి కోర్టులో కేసులు ఉన్నాయని సీఎం చెప్పినట్టు కథనాలు వచ్చాయన్నారు. ఈ 5 శాతం మీద ఏ గౌరవ కోర్టులో స్టే ఇచ్చారో అసెంబ్లీలో గానీ.. మీడియా ద్వారా గానీ తెలియచేసి ఉంటే బాగుండేదన్నారు. నిజంగా కోర్టు స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చేవరకు తమ డిమాండ్లు, హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటామంటూ ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కాపు జాతి ఎలాంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలా? కేవలం ప్రభుత్వం ఇస్తున్న 2 వేల కోట్ల రూపాయలకు ఆశపడి.. కులస్తులంతా ఓటు వేశారని భావిస్తున్నారా.. అంటూ సూటిగా ప్రశ్నించారు.

అటు.. కాపు రిజర్వేషన్ల విషయంలో తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే నైతిక విలువ విజయసాయిరెడ్డికి లేదంటూ ధీటుగా సమాధానం చెప్పారు. కేసులతో కోర్టుల చుట్టు తిరుగుతున్న ఏ-2 ముద్దాయిగా మీరున్నారని మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి నష్టం కలిగే విధంగా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందుకే తాను స్పందించానన్నారు జ్యోతుల నెహ్రూ. ఒకరి ప్రేరణతో నిర్ణయాన్ని వెలిబుచ్చే వ్యక్తిత్వం తనది కాదన్నారు. మనుషుల విలువలు కొలమానం చేయడం చేతగాని వ్యక్తి అని అర్థమయ్యిందని విమర్శించారు జ్యోతుల. మరోవైపు.. కాపు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి, విద్యా, ఉద్యోగాల్లో కేంద్రం ఇస్తామన్న 10 శాతం రిజర్వేషన్లు ఇంకా అమలు కాకపోవడంపై వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కాపు నేతలతో భేటీ అయిన సీఎం జగన్‌.. త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీలో మంత్రి కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబును నియమించారు. కాపు రిజర్వేషన్లు.. కేంద్ర చట్టం.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఆ తరువాత కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story

RELATED STORIES