అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు

అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు

కర్నాటక రాజకీయాల్లో ఒక అంకం ముగిసింది. అనేక రాజకీయ పరిణామాల అనంతరం బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అందరూ ఊహించించట్లే విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి యడియూరప్ప గెలుపొందారు. బలపరీక్షలో బీజేపీకి మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే రెండు ఓట్లు అదనంగా యడియూరప్పకు వచ్చాయి. మూజువాణి ఓటుతో ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్‌ రమేష్ కుమార్ ప్రకటించారు.

కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు 17 మంది రెబల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది. బల పరీక్ష ముందు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి యడియ్యూరప్ప, సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రజాశ్రేయస్సు కోసం పని చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల ఆశల్ని ఆశయాలని నెరవేరుస్తామన్నారు. రైతులకు అండగా నిలుస్తామన్నారు యడియ్యూరప్ప. సీఎం మాటలకు స్పందించిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య కౌంటర్ విసిరారు . కేవలం అసంతృప్తుల్ని తృప్తి పరచడమే కాకుండా.. ప్రజా సమస్యలపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు సిద్ధరాయమ్య.

బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి విరుచుకుపడ్డారు. అసమ్మతి ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడానికి బీజేపీనే కారణమంటూ మండిపడ్డారు. తాను ఎలా పనిచేశానో ప్రజలకు తెలుసన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని .. రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం ఆహ్వానించదగినదే అని పేర్కొన్నారు. కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా రమేశ్‌కుమార్‌ భావోద్వేగంతో మాట్లాడారు. ఒక స్పీకర్‌లా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.

బలపరీక్షలో నెగ్గిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై సీఎం యడియూరప్ప దృష్టి సారించారు. వారంలోగా విస్తరణ చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. అటు బలపరీక్ష అనంతరం స్పీకర్‌ పదవికి రమేశ్‌కుమార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త స్పీకర్‌ ఎన్నికా కూడా ఒకటి రెండు రోజుల్లో జరగొచ్చని తెలుస్తోంది. అటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లెక్కారు. 2023 వరకు తమపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌ శంకర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే రాజీనామా అంశానికి సంబంధించి రెండు పిటిషన్లు సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడీ పిటిషన్‌ కూడా తోడవ్వడంతో వీటన్నింటిపై సుప్రీం త్వరలో విచారణ చేపట్టనుంది.

Tags

Read MoreRead Less
Next Story