తాజా వార్తలు

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి  భారీ వర్షాలు
X

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం కురువగా.... ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఖరీఫ్ మొదలై రెండు నెలలు గడిచినా, వానలు రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఈ వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మొక్కలు, సోయా, పత్తి పంటలకు ప్రాణం పోశాయి. వరి నాట్లు కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.

ఈ వర్షాలతో.. కొన్ని జిల్లాల్లో వరి పొలాలు జలమయమయ్యాయి. వర్షాలకు తోడు ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డ్రైనేజీలు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర అవస్థలు పడ్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాకతీయ సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వరదనీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడి, దాదాపు 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లక్షా 70వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మోటర్లసాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. జిల్లాలోని ఏడు మెలికవాగు, జిల్లేరు, కిన్నెరసాని ఉప్పొంగడంతో పలుగ్రామాలు జలదిగ్భందమయ్యాయి.

Next Story

RELATED STORIES